వడోదర: ఓ నేరాన్ని పరిష్కరించే క్రమంలో పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ల సహాయం తీసుకోవడం సహజమే. అలాగే రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) సాయం కూడా తీసుకుంటారు. కానీ వడోదరలోని ఆర్టీవో మాత్రం అక్కడి స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అడిగిన వివరాలు కూడా షాక్ తిన్నారు. ఇప్పటి వరకూ ఎవరూ తమను ఇలాంటి సమాచారం అడగలేదని వాళ్లు చెబుతున్నారు. ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా అన్నది ఆ పోలీసుల ప్రశ్న. తమ కేసును పరిష్కరించడానికి ఈ సమాచారం చాలా ముఖ్యమైనదని వాళ్లు చెప్పారు.
స్థానికంగా చోటామోటా నేత, అక్రమ దందా నడిపే భవేష్ పటేల్‌పై రేప్ ఆరోపణలు వచ్చాయి. అతడు తన కారు టొయోటా ఫార్చునర్‌లో ఓ మహిళను రేప్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఇదే కాకుండా మరో 18 ఇతర కేసులు కూడా ఉన్నాయి. దీంతో అతన్ని ఎట్టి పరిస్థితితుల్లోనూ విడిచిపెట్టొద్దని భావించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఈ రేప్ కేసులో బలమైన ఆధారాలు సేకరించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఆ మహిళ చెప్పినట్లు ఫ్రంట్ సీటు పుష్బ్యాక్ చేస్తే అందులో రేప్ చేసేంత స్థలం ఉంటుందా, ఆ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బలంగా ఉందా అన్న ప్రశ్నలు ఆర్టీవోను అడిగారు.
సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ గురించి ఎందుకంటే.. కారు ఆగినప్పుడు ఆ మహిళ డోరు తీసుకొని ఎందుకు పారిపోలేదు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఆధారాలు చూపించడానికి. ఈ వింత ప్రశ్నలు తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని, అయితే తాము మ్యాథమెటికల్ రిపోర్ట్ మాత్రం ఇస్తామని, నేరం అందులోనే జరిగిందా లేదా అన్నది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లే తేల్చాలని ఆర్టీవో చెబుతోంది.