టీకా పడింది

- దేశవ్యాప్తంగా మొదలైన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం
- లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
- కరోనాపై నిర్ణయాత్మక గెలుపు మనదేనని స్పష్టీకరణ
- దేశమంటే మట్టికాదోయ్ అంటూ గురజాడ
- మాటలను ఉటంకించిన ప్రధానమంత్రి మోదీ
- టీకా కేంద్రాల వద్ద పండుగ వాతావరణం
- తొలిరోజు 3,352 కేంద్రాల్లో 1.91 లక్షల మందికి వ్యాక్సిన్లు
న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా అంతానికి దేశంలో శనివారం మొదటి అడుగు పడింది. ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. మొదటి రోజు 3,352 టీకా కేంద్రాల్లో 1,91,181 మంది ఆరోగ్య కార్యకర్తలకు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేశారు. కరోనాపై నిర్ణయాత్మక విజయం సాధించబోతున్నామని ప్రధాని అన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు రాసిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' కవితను తెలుగులోనే చదవి ఆకట్టుకొన్నారు.
దేశంలో గతేడాది జనవరి 30న తొలి కరోనా మరణం కేరళలో సంభవించగా.. ఏడాదిలోపే టీకా అందుబాటులోకి వచ్చింది.
పండుగ వాతావరణం
వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా టీకా కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. టీకా కేంద్రాలుగా ఎంపిక చేసిన దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూల తోరణాలతో అలంకరించారు. టీకాలున్న బాక్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పటాకులు పేల్చి సంబురాలు చేసుకొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతమైందని, టీకా వేసుకున్నవారిలో పెద్దగా తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ వెల్లడించారు.
అంత్యక్రియలూ జరుపలేకపోయాం!
ప్రధాని మోదీ భావోద్వేగం
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారిపై భారత్ నిర్ణయాత్మక విజయం సాధించబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన పలు రాష్ర్టాల్లోని ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖాన, నార్సింగిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు తీసుకొన్నవారితో ప్రధాని మాట్లాడారు. కరోనా వల్ల ఏడాదిపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయినవారికి కనీసం శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోయామని ఆవేదన వ్యక్తంచేస్తూ కన్నీరు పెట్టుకొన్నారు. టీకాలపై కొన్ని వర్గాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టీకాలు వేసుకున్నప్పటికీ ప్రజలంతా ఇప్పటిలాగే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘టీకా కూడా.. జాగ్రత్తలు కూడా’ అని పిలుపునిచ్చారు. తెలుగు కవి, రచయిత గురజాడ అప్పారావు రాసిన కవితను మోదీ గుర్తు చేశారు. ‘సొంతలాభం కొంత మానుకు.. పొరుగువాడికి తోడు పడవోయ్.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అని ప్రధాని అన్నారు. మొదటి దశలో మూడు కోట్ల మందికి, రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు వేస్తామని చెప్పారు. మొదటి డోసు వేసుకొన్నవారు తప్పనిసరిగా నెలలోగా రెండో డోసు టీకా కూడా వేసుకోవాలని సూచించారు. రెండో డోసు వేసుకొన్న తర్వాత రెండువారాల్లో కొవిడ్-19 వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి శరీరంలో అభివృద్ధి చెందుతుందని, అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
తాజావార్తలు
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్లో బన్నీ ఫ్యామిలీ హల్చల్
- ముంబై సుందరీకరణలో ట్రాన్స్జెండర్లు
- ఇబ్రహీంపట్నంలో వ్యక్తి దారుణ హత్య
- దేశంలో 1.23 కోట్ల మందికి వ్యాక్సిన్ : కేంద్రం
- బెంగాల్లో ఓవైసీ ర్యాలీకి పోలీసుల బ్రేక్
- నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్.. వీడియో వైరల్
- 4 రాష్ట్రాల ప్రయాణికులపై బెంగాల్ ఆంక్షలు
- చేపల కోసం లొల్లి.. ఎక్కడో తెలుసా?