సోమవారం 18 జనవరి 2021
National - Jan 14, 2021 , 13:56:21

వారానికి నాలుగు రోజులే కొవిడ్‌ టీకా పంపిణీ : ఢిల్లీ సీఎం

వారానికి నాలుగు రోజులే కొవిడ్‌ టీకా పంపిణీ : ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌ టీకా పంపిణీకి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది, ఈ మేరకు పరిస్థితిని సమీక్షించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఢిల్లీకి 2.74లక్షల టీకాలు వచ్చాయని తెలిపారు. 1.2లక్షల టీకాలు ఆరోగ్య కార్యకర్తలు వేస్తామని.. ఇప్పటి వరకు 2.4లక్షల మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు తీసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ప్రతి వ్యక్తికి షెడ్యూల్‌ ప్రకారం.. టీకా రెండు డోసులు వేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా 81 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. క్రమంగా వాటిని 175కు.. ఆ తర్వాత వెయ్యి కేంద్రాలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో వంద వ్యాక్సిన్లు ఇవ్వబడుతాయని, టీకా పంపిణీ వారంలో నాలుగు రోజులు సాగుతుందని చెప్పారు. సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని తెలిపారు.  ప్రజలు ఏడాదిగా కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని, టీకా రాకతో ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో బుధవారం 375 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 11 మంది మరణించారని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.