శనివారం 04 జూలై 2020
National - May 25, 2020 , 21:44:09

లాక్‌డౌన్‌తో 24 ఏండ్ల తర్వాత ఇంటికి..

లాక్‌డౌన్‌తో 24 ఏండ్ల తర్వాత ఇంటికి..

డెహ్రాడూన్‌: ఇంటి నుంచి పారిపోయిన ఓ యువకుడు లాక్‌డౌన్‌ కారణంగా 24 ఏండ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ జిల్లా రమాది గ్రామంలో జరిగింది. ప్రకాశ్‌సింగ్‌ కర్కి అనే వ్యక్తి హైస్కూల్‌ వరకు చదివాడు. ఏదైనా పని చేసి బాగా సంపాదించాలన్న కోరికతో 1995లో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయాడు. తొలుత ఢిల్లీకి వెళ్లి చిన్నచిన్న పనులు చేసిన ప్రకాశ్‌ సింగ్‌ కర్కి.. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లి తొటపని చేశాడు. ఆ తర్వాత గుజరాత్‌ వెళ్లి ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. 

కరోనా వైరస్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ విధించడంతో ప్రకాశ్‌ సింగ్‌ ఉపాధి కోల్పోయాడు. అందరూ సొంతూర్లకు పోతుండటంతో ప్రకాశ్‌కు తన కుటుంబసభ్యులు గుర్తుకొచ్చారు. దాంతో మే 16న బయల్దేరి రెండు రోజుల అనంతరం ఇంటికి చేరుకొన్నాడు. తండ్రి అప్పటికే మరణించగా.. వృద్ధురాలైన తల్లి, సోదరులను ప్రకాశ్‌ కలుసుకొని ఆనందపరవశుడయ్యాడు. ప్రకాశ్‌ను గుర్తుపట్టిన వారంతా ఇంటికి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై కుటుంబాన్ని విడిచి పోనని, ఇదే గ్రామంలోనే ఉండి ఏదో ఒక పని చూసుకొంటానని, 24 ఏండ్ల తర్వాత కుటుంబసభ్యులను కలువడం ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రకాశ్‌ చెప్పాడు.


logo