బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 16:42:49

కేదార్‌నాథ్‌లో భారీ హిమ‌పాతం.. చిక్కుకున్న ఇద్ద‌రు సీఎంలు

కేదార్‌నాథ్‌లో భారీ హిమ‌పాతం.. చిక్కుకున్న ఇద్ద‌రు సీఎంలు

హైద‌రాబాద్‌:  ఉత్త‌రాఖండ్ సీఎం తివేంద్ర సింగ్ రావ‌త్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌లు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు.  హిమాల‌యాల్లో శీతాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఇవాళ మూసివేశారు. అయితే ఉద‌యం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇద్ద‌రు సీఎంలు కేదార్‌నాథ్ వెళ్లారు. కానీ అక్క‌డ ఇవాళ ఉద‌యం భారీగా మంచు కురిసింది.  హిమ‌పాతం ఇంకా కురుస్తున్నందు వ‌ల్ల .. ఇద్ద‌రు సీఎంలు కేదార్‌నాథ్‌లో ఉన్న‌ట్లు ఉత్త‌రాఖండ్ డీజీ అశోక్ కుమార్ తెలిపారు.  స్నోఫాల్ అధికంగా ఉన్న కార‌ణంగా.. హెలికాప్ట‌ర్ స‌ర్వీసులు నిలిచిపోయాయి.  

ఇవాళ ఉద‌యం 8.30 నిమిషాల‌కు కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మూసివేశారు.  భాయ్ దూజ్ కార్య‌క్ర‌మం త‌ర్వాత ఆల‌య ద్వారాల‌ను మూసివేశారు. అయితే ఈ స‌మ‌యంలో భారీగా హిమ‌పాతం కురిసింది. త్రివేంద్ర సింగ్ రావ‌త్‌, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు దేవ‌స్థానం బోర్డు అధికారులు, పూజారులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  ఆల‌యంలో ప్రార్థ‌న‌లు చేప‌ట్టేందుకు,  కేదార్‌పురిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల‌ను పర్య‌వేక్షించేందుకు ఆదివారం ఇద్ద‌రు సీఎంలు కేదార్‌నాథ్‌కు వ‌చ్చారు.  

మ‌హాశివుడి కోసం ఆల‌య పూజారులు స‌మాధి పూజ నిర్వ‌హించారు.  శివుడి ప్ర‌తిమ‌ను ఉత్స‌వ్ డోలీలో పెట్టుకుని ఊకీమ‌ఠ్‌లోని ఓంకారేశ్వ‌ర్ ఆల‌యానికి త‌ర‌లించ‌నున్నారు. శీతాకాలంలో కేదారీశ్వ‌రుడికి అక్క‌డే పూజ‌లు నిర్వ‌హిస్తారు.  అయితే ఆదివారం రాత్రి నుంచే కేదార్‌నాథ్  లో హిమ‌పాతం కురుస్తోంది.  ఈ ఏడాది కేదార్‌నాథ్‌ను 1,35,023 మంది భ‌క్తులు విజిట్ చేశారు. కోవిడ్ నేప‌థ్యంలో ఆల‌య ద‌ర్శ‌నం కోసం నిబంధ‌న‌లు విధించిన విష‌యం తెలిసిందే.