శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 16:48:44

వికాస్ దూబేది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు...

వికాస్ దూబేది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు...

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అతడి అనుచరులపై జరిగిన ఎన్‌కౌంటర్లు బూటకం కాదని వాస్తవంగా జరిగినవేనని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం సంబంధిత పిటిషన్లపై సోమవారం విచారణ జరుపనున్నది.

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడితోపాటు అనుచరులు కాల్పులు జరుపడంతో 8 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఆలయం వద్ద వికాస్ దూబేను ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించగా రాష్ట్రానికి తరలిస్తున్న క్రమంలో కాన్పూర్‌కు సమీపంలో జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో వికాస్ చనిపోయాడు. అతడి ఐదుగురు అనుచరులు కూడా వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్లలో మరణించారు.

ఈ నేపథ్యలంలో యూపీ పోలీసులు వారిని ఉద్దేశపూర్వకంగానే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాదులు ఘనశ్యామ్ ఉపాధ్యాయ్, అనూప్ ప్రకాష్ అవస్థీ వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు యూపీ పోలీసుల వివరణ కోరింది. ఈ నేపథ్యంలో వికాశ్ దూబేతోపాటు అతడి అనుచరులపై జరిగిన ఎన్‌కౌంటర్లు నకిలీవి కాదని, వారు కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రాణ రక్షణ నిమిత్తం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం ఒక నివేదికను యూపీ పోలీసులు సమర్పించారు.


logo