శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 18:19:20

ప్రియాంకగాంధీకి యోగి ఆదిత్యనాథ్‌ గ్రీన్‌సిగ్నల్‌

ప్రియాంకగాంధీకి యోగి ఆదిత్యనాథ్‌ గ్రీన్‌సిగ్నల్‌

లక్నో: లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమతమ సొంతూళ్లకు పోయేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగోలా ఇంటికి చేరుతే చాలు.. కలో గంజో తాగి బతుకుతామంటూ కొందరు నడుస్తూ.. మరికొందరు ఏదో ఒక వాహనం పట్టుకొని ఇండ్లకు చేరుతున్నారు. మండుతున్న ఎండల్లో కార్మికులు నడిచిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఇండ్లకు దింపేందుకు ప్రభుత్వానికి చేతగాని పక్షంలో తమకు చెప్తే.. బస్సులు ఏర్పాటుచేస్తామని కాస్తా గట్టిగానే చెప్పారు.

ప్రియాంక గాంధీ మాటలను ఎలా అర్థం చేసుకొన్నారో ఏమో గానీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ మాత్రం ప్రియాంకగాంధీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. వలస కార్మికులను సొంతూళ్లకు పంపేందుకు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో వేయి బస్సులు నడుపుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి అవనీష్‌ అవాస్థి.. వేయి బస్సులు నడుపుకొనేందుకు ముఖ్యమంత్రి మీకు అనుమతి ఇచ్చారంటూ ప్రియాంకగాంధీకి సమాచారమిచ్చారు. ఇలాఉండగా.. కాంగ్రెస్‌ నేతలు చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 


logo