శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 02:24:00

సైన్యానికి అమెరికా దన్ను

సైన్యానికి అమెరికా దన్ను

  • అగ్రరాజ్యంతో కీలక రక్షణ ఒప్పందం
  • రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీలో సంతకాలు
  • సున్నిత మిలిటరీ సమాచార మార్పిడికి అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 27: ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఒంటెద్దు పోకడలను అడ్డుకొనేందుకు పావులు కదుపుతున్న భారత్‌- అమెరికా చరిత్రాత్మక ఒప్పందంతో కీలక ముందడుగు వేశాయి. రెండు దేశాల మధ్య అత్యంత సున్నితమైన సాంకేతిక సమాచార మార్పిడికి ఉద్దేశించిన బేసిక్‌ ఎక్ఛ్సేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై మంగళవారం సంతకాలు చేశాయి. భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మార్క్‌ టీ ఎస్పర్‌, మైక్‌ పాంపియోతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం మూడో దఫా ముఖాముఖి (2+2) చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ, అంతర్జాతీయ అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం నలుగురు మంత్రులు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

గొడవలు పెట్టడం మానుకోండి: చైనా

బీజింగ్‌: తమ పొరుగు దేశాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే విధానాన్ని మానుకోవాలని అమెరికాను చైనా హెచ్చరించింది. భారత్‌తో అమెరికా కీలకమైన బెకా ఒప్పందం చేసుకున్న వెంటనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తీరుతో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతున్నదని  మండిపడ్డారు. 

చైనా వల్లనే సమస్యలు: పాంపియో

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురుసు వైఖరిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విరుచుకుపడ్డారు. చైనా పాలక కమ్యూనిస్టు పార్టీకి (సీసీపీ) ప్రజాస్వామ్యం అంటే అస్సలు నచ్చదని విమర్శించారు. భద్రత విషయంలో భారత్‌కు అమెరికా ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గల్వాన్‌ ఘర్షణలో చైనాతో పోరాడుతూ వీరమరణం పొందిన 20 మంది సైనికులకు పాంపియో శ్రద్ధాంజలి ఘటించారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పటంపైనే ప్రధానంగా చర్చించినట్టు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతపై ఇకనుంచి అమెరికా- భారత్‌లు తరుచూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. 

ఏమిటీ బెకా?

  • అమెరికా- భారత సైన్యాల మధ్య అత్యంత ప్రధానమైన యుద్ధ, ఆయుధ సాంకేతికను పరస్పరం బదిలీ చేసుకొనేందుకు ఉద్దేశించినదే ‘బేసిక్‌ ఎక్ఛ్సేంజ్‌ అండ్‌ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)’.
  • ఈ ఒప్పందంతో భారత సైన్యానికి అమెరికా శాటిలైట్లు సేకరించిన కీలక భౌగోళిక ప్రాంతాల సమాచారం అందుతుంది. 
  • యుద్ధరంగంలో బలగాల సమన్వయానికి, అత్యంత వేగంగా శత్రువును చావుదెబ్బ తీయటానికి ఈ డాటా కీలకం.
  • బెకా ఒప్పందంతో హిందూమహా సముద్ర ప్రాంతంలో భారత సైన్యం తిరుగులేని శక్తిగా అవతరించనున్నది.
  • భారత్‌తో అమెరికా మొత్తం ఐదు ఒప్పందాలు చేసుకోగా.. అందులో బెకాతో పాటు అణుశక్తి, భూవిజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, ఆయుర్వేదరంగా లకు సంబంధించినవి ఉన్నాయి.