శనివారం 28 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 14:54:37

బెదిరింపు ఏదైనా.. మా అండ భార‌త్‌కే: మైక్ పొంపియో

బెదిరింపు ఏదైనా.. మా అండ భార‌త్‌కే: మైక్ పొంపియో

హైద‌రాబాద్‌:  భార‌త్‌‌, అమెరికా దేశాలు బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆప‌రేష‌న్ అగ్రిమెంట్‌(బీఈసీఏ) ఒప్పందం కుదుర్చుకున్నాయి.  సైనిక సాంకేతిక అంశంపై రెండు దేశాలు స‌హ‌కారం అందించుకోనున్నాయి.  ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ట్లు ర‌క్ష‌ణ‌మంత్రిత్వ‌శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి జీవేశ్ నంద‌న్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మీడియాతో మాట్లాడారు.  రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యాయ‌ని, రెండు దేశాల మ‌ధ్య కొత్త యుగం ప్రారంభంకావాల‌న్నారు.  గ‌త ఏడాది త‌ర‌హాలోనూ త‌మ విధానాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని,  మునుముందు ఇంకా ఎంతో చేరుకోవాల్సి ఉంద‌న్నారు. 

అనంత‌రం  2+2 మంత్రుల స‌మావేశం త‌ర్వాత కూడా మైఖేల్ పొంపియో మాట్లాడుతూ.. భార‌త సైనిక ద‌ళాల‌కు చెందిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు.  భార‌త సైనిక ద‌ళాల్లో ప‌నిచేస్తూ ప్రాణ త్యాగం చేసిన వారి గౌర‌వ సూచ‌కంగా తాము ఇవాళ నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్‌ను విజిట్ చేసిన‌ట్లు తెలిపారు.  ఇటీవ‌ల ల‌డాఖ్ స‌రిహ‌ద్దులోని గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన 20 మంది భార‌తీయ జ‌వాన్ల మృతి ప‌ట్ల కూడా సంతాపం తెలిపిన‌ట్లు పొంపియో చెప్పారు.  సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు భార‌త్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు అమెరికా అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.    చైనా క‌మ్యూనిస్టు పార్టీ నుంచి మాత్ర‌మే కాదు, ఎటువంటి బెదిరింపుల‌నైనా ఎదుర్కొనేందుకు భార‌త్‌, అమెరికా దేశాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తాయ‌న్నారు. సైబ‌ర్‌, నేవీ రంగాల్లో గ‌త ఏడాది త‌మ స‌హ‌కారాన్ని విస్త‌రించిన‌ట్లు పొంపియో తెలిపారు.