సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 11:06:32

భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షలు వీరే..

భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షలు వీరే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టనున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా వస్తున్నారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ట్రంప్‌ ఆదివారం భారత్‌కు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.  భారత్‌లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్‌ ఏడవ అధ్యక్షుడిగా నిలువనున్నారు. గతంలో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షలు వీరే..

1. డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌ (1959 డిసెంబర్‌ 9-14 )

భారత్‌లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి.ఐసన్‌హోవర్‌. ఆయన జరిపిన చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి పునాది వేసింది. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌, ప్రధాని నెహ్రూతో ఆయన సమావేశమయ్యారు. రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజ్‌మహాల్‌ను సందర్శించారు.

2. రిచర్డ్‌ నిక్సన్‌ (1969 జూలై 31-ఆగస్టు1)

ఇందిరా గాంధీ హయాంలో భారత్‌లో పర్యటించిన రిచర్డ్‌ నిక్సన్‌, కొన్ని గంటలపాటు మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ వైపు మొగ్గుచూపడంతో ఆయన పర్యటనపట్ల భారత్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు.

3. జిమ్మీ కార్టర్‌ (1978 జనవరి 1-3) 

ఎమర్జెన్సీ అనంతరం ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జిమ్మీ కార్టర్‌ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం, 1974లో అణు పరీక్షల నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ఢిల్లీ సమీప గ్రామాన్ని సందర్శించగా అనంతరం ఆ గ్రామానికి ఆయన పేరుపెట్టారు. 

4. బిల్‌ క్లింటన్‌ (2000 మార్చి 19-25)

జిమ్మీ కార్టర్‌ తర్వాత సుమారు 20 ఏండ్లకుపైగా అమెరికా అధ్యక్షులెవరూ భారత్‌లో పర్యటించలేదు. 2000లో బిల్‌ క్లింటన్‌ భారత్‌కు వచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అణు పరీక్షలు జరుపడం, కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన పరిణామాలతో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించిన తరుణంలో క్లింటన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక , ఆర్థిక భాగస్వామ్యానికి ఆయన పర్యటన దోహదపడింది. ఇంధనం, పర్యావరణం అంశాల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేశారు. తాజ్‌మహల్‌తోపాటు జైపూర్‌, హైదరాబాద్‌, ముంబై వంటి ప్రముఖ ప్రాంతాలనూ సందర్శించారు. 

5. జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ (2006 మార్చి 1-3)

ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలో యూపీఏ తొలి ప్రభుత్వం కొలువైన వేళ, భార్య లారా బుష్‌తో కలిసి జార్జ్‌ బుష్‌ భారత్‌ను సందర్శించారు. ఢిల్లీలోని పురానా ఖిలాలో కొద్ది మంది ప్రముఖులనుద్దేశించి ప్రసంగించారు. అణు ఒప్పందం ఖరారుకు ఆయన పర్యటన దోహదపడింది.

6. బరాక్‌ ఒబామా (2010 నవంబర్‌ 6-9, 2015 జనవరి 24-27)

రెండుసార్లు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రికార్డు సృష్టించారు. గత అధ్యక్షులకు భిన్నంగా తొలి పర్యటన సాగింది. ఉగ్రదాడితో తల్లడిల్లిన ముంబైలో అడుగుపెట్టి బాధితులకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. భారీ వాణిజ్య బృందంతో వచ్చిన ఆయన అమెరికా ఇండియా పారిశ్రామిక సదస్సులో ప్రసంగించారు. ఐరాస భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చారు. భార్య మిచెల్‌ ఒబామా ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిరుపేద పిల్లలతో కలిసి డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2015లోనూ భార్యతో కలిసి ఒబామా భారత్‌లో మరోసారి పర్యటించారు. గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌, మోదీతో పలు అంశాలపై చర్చలు జరిపారు. 


logo