శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 03:30:46

70 లక్షలు కాదు లక్షే!

70 లక్షలు కాదు లక్షే!
  • ట్రంప్‌కు స్వాగతం పలికే ప్రజల సంఖ్యపై అహ్మదాబాద్‌ కమిషనర్‌ వివరణ
  • 22 కి.మీ. పొడవున రోడ్‌షో.. మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌' సభ
  • రోడ్డు పొడవున సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు
  • 100 కెమెరాలతో ప్రపంచమంతటా ప్రత్యక్ష ప్రసారం

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 20: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో తనకు 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశపడుతుండగా, స్థానిక యంత్రాంగం మాత్రం లక్ష మందిని సమీకరించేందుకు అష్టకష్టాలు పడుతున్నది. ‘నమస్తే ట్రంప్‌' పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో ట్రంప్‌ పర్యటించనున్నారు. సోమవారం అహ్మదాబాద్‌లో విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించిన మోతెరా క్రికెట్‌ స్టేడియం వరకు ఆయన 22 కిలోమీటర్లు రోడ్‌షోలో పాల్గొననున్నారు. 


ఈ సందర్భంగా రోడ్డుకిరువైపులా దాదాపు 70 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మోదీ తనతో చెప్పారని ఇటీవల ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే నగరంలోనే 70 లక్షల జనాభా లేదని మున్సిపల్‌ అధికారి ఒకరు చెప్పారు. ట్రంప్‌కు లక్ష నుంచి రెండు లక్షల మంది నగరవాసులు స్వాగతం పలికే అవకాశం ఉందని నగర మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ నెహ్రా తెలిపారు. అనంతరం క్రికెట్‌ స్టేడియంలో అమెరికా అధ్యక్షుని గౌరవార్థం ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమం జరుగనుంది. 


విమానాశ్రయంలో దిగిన అనంతరం ప్రధాని మోదీతో కలిసి ట్రంప్‌ ముందుగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారని, ఆ తరువాత అక్కడి నుంచి ఇద్దరు నేతలు క్రికెట్‌ స్టేడియం వరకు రోడ్‌షోలో పాల్గొంటారని నెహ్రా తెలిపారు. రోడ్‌షోను అటు అమెరికా అధ్యక్షునికి, ఇటు గుజరాత్‌ వాసులకు చిరస్మరణీయమైనదిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. రోడ్‌షోలో భాగంగా అక్కడక్కడా 50 వేదికలు ఏర్పాటు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. 


ఈ ప్రదర్శనల కోసం దేశమంతటి నుంచి కళాకారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఒక్కో రాష్ర్టానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని, ఆయా రాష్ర్టాల కళాకారులు తమ సంప్రదాయ దుస్తులను ధరించి తమ ఆట, పాటతో అలరిస్తారని చెప్పారు. ఇక రోడ్‌షో జరిగే మార్గమంతా ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా అలంకరిస్తామని తెలిపారు. రోడ్‌షో జరిగే మార్గంలో దూరదర్శన్‌ 100 కెమెరాలను ఏర్పాటు చేస్తుందని, ఆ కార్యక్రమం ప్రపంచమంతటా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు. 


మరోవైపు ట్రంప్‌ పర్యటనకు జనసమీకరణపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. రాజకీయపార్టీల బహిరంగ సభలకు మాదిరిగానే దీనికి కూడా జనసమీకరణ చేస్తారేమోనని పలువురు వ్యాఖ్యానించారు. 70 లక్షల మందితో స్వాగతం పలికేందుకు ట్రంప్‌ దేవుడా అంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ట్రంప్‌ పర్యటన కోసం చేస్తు న్న ఏర్పాట్లపై శివసేన విరుచుకుపడింది. ‘ఇది బీజేపీ బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నది’ అని విమర్శించింది. ఇదిలా ఉండగా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని గురువారం ట్రంప్‌ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.  


నిరసనలకు ‘లెఫ్ట్‌' సిద్ధం

ట్రంప్‌ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపాలని సీపీఐ.. పురోగామి శక్తులకు పిలుపునిచ్చింది. ట్రంప్‌ పర్యటనను వ్యతిరేకించాలని సీపీఎం కూడా ఇదివరకే పిలుపునిచ్చింది.


logo