శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 11:52:55

అతిథి దేవో భవ.. అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌

అతిథి దేవో భవ.. అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌

గుజరాత్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు. ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం వచ్చింది. అహ్మదాబాద్ లో అడుగుపెట్టే కంటే ముందు ట్రంప్ హిందీలో ట్వీట్ చేశారు. భారత పర్యటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఫాలో అవుతున్న ట్రంప్.. దారిలో ఉన్నా.. మరి కొద్ది గంటల్లో మీ అందర్ని కలుస్తాననీ.. భారత్ కు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి ట్వీట్ కు మోదీ స్పందిస్తూ.. అతిథి దేవో భవ అంటూ హిందీలో ట్వీట్ చేశారు మోదీ. 

ట్రంప్ ఇవాళ్టి పర్యటన వివరాలు.. 

ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. అనంతరం అహ్మదాబాద్‌ వీధుల్లో భారీ జనసందోహం నడుమ సుమారు 22 కి.మీ. మేర రోడ్‌షో సాగనుంది. మార్గమధ్యంలో కొంతసేపు సబర్మతి ఆశ్రమం వద్ద ఆగి, జాతిపిత గాంధీజీకి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా రాట్నం, గాంధీజీ జీవితానికి సంబంధించిన పుస్తకాలు, బాపూజీ ప్రతిమను ట్రంప్‌కు మోదీ బహూకరిస్తారు. 

అనంతరం 12.30 గంటలకు ఇరువురు నేతలు మోతేరా స్టేడియానికి చేరుకుని ‘నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సుమారు 1.10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. పలువురు బాలీవుడ్‌ తారలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

మధ్యాహ్నం ప్రధాని ఇచ్చే విందుకు ట్రంప్‌ దంపతులు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగ్రాకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు తాజ్‌మహల్‌కు చేరుకుంటారు. సుమారు 45 నిమిషాలపాటు అక్కడ గడుపనున్నారు. అనంతరం వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. logo