శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 15:41:24

జేఈఈ మెయిన్ పరీక్షా తేదీలతో క్లాష్‌ కానున్న యూపీఎస్‌సీ ఎన్‌డీఏ పరీక్ష తేదీలు

జేఈఈ మెయిన్ పరీక్షా తేదీలతో క్లాష్‌ కానున్న యూపీఎస్‌సీ ఎన్‌డీఏ పరీక్ష తేదీలు

న్యూ ఢిల్లీ : రెండుసార్లు వాయిదా వేసిన తరువాత జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇప్పుడు జేఈఈ ప్రధాన పరీక్షలు యూపీఎస్‌సీ, ఎన్‌డీఏ పరీక్షల తేదీలు క్లాష్‌ అవుతుండడంతో జేఈఈ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. 

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ మాట్లాడుతూ ‘‘ ఎన్‌డీఏతో జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు క్లాష్‌ నేపథ్యంలో చాలా మంది విద్యార్థుల నుంచి నాకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ విషయాన్ని మేము పరిశీలించాం. సెప్టెంబరు 6న జరగాల్సిన ఎన్‌డీఏ పరీక్షలో జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసే విద్యార్థులు కూడా కొంతమంది హాజరు కానున్నట్లు తెలిసింది. రెండు పరీక్షల్లో హాజరయ్యే అభ్యర్థుల కోసం రెండు పరీక్షలు ఒకే రోజు జరుగకుండా ఎన్‌టీఏ (జాతీయ పరీక్ష సంస్థ) మరో తేదిని నిర్ధారిస్తుంది’’అని ట్వీట్‌ చేశారు. 

జేఈఈ మెయిన్‌ పరీక్షల కోసం సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష. జేఈఈ మెయిన్‌ క్లియర్‌ చేసిన విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌కు హాజరు కావడంతో ఐఐటీలకు దరఖాస్తు చేసుకుంటారు. ఈ ఏడాది విద్యార్థులకు జేఈఈ మెయిన్‌, నీట్ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎక్కువ సమయం లభించింది. విద్యార్థులందరికీ సమయం అందుబాటులో ఉన్నందున అగ్రశ్రేణి విద్యార్థులు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ సంవత్సరం కట్-ఆఫ్ ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని, పరీక్షల సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండాలని, పరీక్ష హాలులో తక్కువ మంది విద్యార్థులను అనుమతించాలని, మాస్కులు తప్పనిసరి చేసి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ)ను కోరింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo