బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 03:20:45

రిటైల్‌పై లాక్‌డౌన్‌ దెబ్బ

రిటైల్‌పై లాక్‌డౌన్‌ దెబ్బ

  • భారీ అద్దెలు, ఇతర ఖర్చులు భరించలేక సతమతం
  • లాక్‌డౌన్‌ ఎత్తేసినా 20% దుకాణాలు మూతపడే అవకాశం

న్యూఢిల్లీ, మే 13: కరోనా సంక్షోభంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా దుకాణాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా దాదాపు 20 శాతం రిటైల్‌ దుకాణాలు తిరిగి తెరుచుకొనే పరిస్థితులు కనిపించడంలేదు. గత రెండు నెలల నుంచి వ్యాపారాలు నడవకపోవడం, భారీ అద్దెలు, ఇతర ఖర్చులను భరించే స్థితిలో దుకాణదారులు లేకపోవడం, మున్ముందు కూడా కస్టమర్లు కేవలం నిత్యావసర సరుకుల కొనుగోళ్లకే పరిమితమవుతారన్న అంచనాలే ఇందుకు కారణమని వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించడం అసాధ్యంగా ఉండే ఇరుకైన ప్రాంతాల్లో దుకాణాలను మూసేయాలని వ్యాపారులు ఇప్పటికే నిర్ణయించుకొన్నారు. 

ముంబైలోని కొలాబా, నారిమన్‌ పాయింట్‌, అంధేరీ.. ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌, కన్నాట్‌ ప్లేస్‌, సదర్‌ బజార్‌ సహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో 60 శాతానికిపైగా రిటైల్‌ దుకాణాలు కిరాయిదారుల చేతిలోనే ఉన్నాయని, వీరిలో చాలామంది తమ దుకాణాల అద్దె చెల్లించగలిగే పరిస్థితి లేదని వ్యాపారవర్గాలు చెప్తున్నాయి. వెయ్యి చదరపు అడుగులున్న దుకాణం నెలవారీ అద్దె ఖాన్‌ మార్కెట్‌లో రూ.5 లక్షలకుపైగా, బ్రీచ్‌ క్యాండీలో రూ.3 లక్షలకుపైగా ఉంటుందని అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. దేశంలో లాక్‌డౌన్‌ను తొలిగించిన తర్వాత కనీసం 20 శాతం రిటైల్‌ దుకాణాల్లో వ్యాపారాలు మూతపడతాయని, అంతేకాకుండా వీటిపై ఆధారపడిన ఇతర దుకాణదారుల్లో దాదాపు 10 శాతం మంది తమ వ్యాపారాలను మూసేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒప్పందాలు అసాధ్యమైనవే..!

ఢిల్లీలోని పాత మార్కెట్లలో నెలకు దాదాపు రూ.5 లక్షల అద్దె చెల్లిస్తున్న దుకాణదారులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారని చాందినీచౌక్‌ సర్వ వ్యాపార మండల్‌ అధ్యక్షుడు సంజయ్‌ భార్గవ తెలిపారు. ఈ దుకాణదారులకు, వాటి యజమానులకు మధ్య కుదిరిన ఒప్పందాలను అసాధ్యమైనవి (ఫోర్స్‌ మెజ్యూర్‌)గా పరిగణించి వాటిని రద్దుచేయాలని ఆయన కోరారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత దుకాణాల అద్దెలు 50%పైగా తగ్గుతాయని వ్యాపార వర్గాలు తెలిపాయి.

నగల అమ్మకానికి..బంగారం దుకాణాలకు 

ముంబై: దేశవ్యాప్తంగా పలు గ్రీన్‌జోన్లలో ప్రస్తుతం ఆభరణ దుకాణాలు మళ్లీ తెరుచకొన్నప్పటికీ అమ్మకాలు మాత్రం నామమాత్రంగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కాకుండా తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను లేదా బంగారు నాణేలను అమ్ముకొనేందుకే ఈ దుకాణాలకు వస్తున్నారు. కరోనా సంక్షోభంతో ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా గతేడాది మే నెలలో జరిగిన పుత్తడి అమ్మకాలతో పోలిస్తే గత కొన్నిరోజులుగా 15 నుంచి 20 శాతం అమ్మకాలు మాత్రమే జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌, సామాజిక దూరం నిబంధనలు కొనసాగుతుండటంతో ఆభరణ దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది.

 ప్రస్తుతం కర్ణాటకలో చాలా ఆభరణ దుకాణాలు తిరిగి తెరుచుకొన్నాయని, కానీ సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు కేవలం 20 శాతం మించి అమ్మకాలు జరుగడంలేదని ఆలిండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. దుకాణాలకు వచ్చే కస్టమర్లలో ఎక్కువమంది పాత ఆభరణాలను అమ్మేందుకే వస్తుండటంతో ఈ ఏడాది పాత బంగారం అమ్మకాలు 50% పెరుగవచ్చని  నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ర్టాల్లో పాత ఆభరణ అమ్మకాలు గణనీయంగా పెరుగవచ్చని ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.


logo