గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 20, 2020 , 19:16:49

కోతులు వెంటపడటంతో ఇంటి పైకప్పు నుంచి పడి బాలిక మృతి

కోతులు వెంటపడటంతో ఇంటి పైకప్పు నుంచి పడి బాలిక మృతి

ముజఫర్‌నగర్ : కోతులు వెంటపడటంతో భయంతో పరిగెత్తిన ఓ బాలిక ఇంటి పైకప్పు నుంచి కింద పడి ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని నోలీ గ్రామంలో ఓ బాలిక ఇంటి పైకప్పుపై ఆరేసిన దుస్తులను తీసుకొచ్చేందుకు ఇంటిపైకెక్కింది. ఇదే సమయంలో ఇంటిపైకప్పుపై కూర్చున్న కోతులు బాలికను చూడగానే వెంటపడ్డాయి. దాంతో వాటి బారి నుంచి బయటపడేందుకు ఆ బాలిక ఇంటిపైకప్పు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలు స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోతులు వెంబడించడంతో పారిపోయే క్రమంలో ఇంటి పైకప్పు నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడిందని భోపా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ముజఫర్‌నగర్‌ జిల్లాలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉన్నదని, వాటి బారి నుంచి రక్షించాలని చాలా సార్లు అధికారులకు విన్నవించినా లాభం లేకపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఇండ్లలోకి వస్తున్న కోతులు ఆహారపదార్థాలు, విలువైన వస్తువులను ఎత్తుకుపోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.