సోమవారం 30 మార్చి 2020
National - Feb 25, 2020 , 01:04:10

మసీదు.. దవాఖాన నిర్మిస్తాం

మసీదు.. దవాఖాన నిర్మిస్తాం
  • అయోధ్యలోని స్థలంలో నిర్మాణాలపై యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు నిర్ణయం

న్యూఢిల్లీ: అయోధ్యలో తమకు కేటాయించిన ఐదెకరాల భూమిలో ఒక మసీదును, దవాఖానను, ఇండో-ఇస్లామిక్‌ సెంటర్‌ను, ప్రజా గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. మసీదు నిర్మాణం కోసం యూపీ సర్కార్‌ తమకు కేటాయించే ఐదెకరాల భూమిని తీసుకోవాలని నిర్ణయించామని బోర్డు చైర్మన్‌ జాఫర్‌ ఫారూఖీ సోమవారం మీడియాతో చెప్పారు. మసీదు నిర్మాణం కోసం త్వరలో సున్నీ వక్ఫ్‌బోర్డు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు పేరు నూతనంగా నిర్మించే మసీదుకు పెట్ట డంపై ట్రస్ట్‌ నిర్ణయం తీసుకుంటుందని, వక్ఫ్‌బోర్డు పాత్రేమీ లేదన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మసీదు పరిమాణం ఉంటుందన్నారు. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్య జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలోని సొహవాల్‌ ప్రాంతంలోని ధన్నీపూర్‌ గ్రామంలో మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే దవాఖాన వంటి వాటిని నిర్మించాలన్న సలహాలు వచ్చాయి. ఈ మేరకు బోర్డు ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. logo