ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 10:48:23

చైనా యాప్‌లు తొలగించండి: సిబ్బందికి ఐజీ ఆదేశాలు

చైనా యాప్‌లు తొలగించండి: సిబ్బందికి ఐజీ ఆదేశాలు

లక్నో: లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సేనల మధ్య ఘర్షణ దరిమిలా చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దేశ ప్రజలు నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తూ చైనాకు చెందిన వస్తువులను తగులబెడుతున్నారు. ఇలాంటి ఆగ్రహాన్నే వ్యక్తం చేస్తున్నారు యూపీకి చెందిన ఓ పోలీసు అధికారి. చైనాకు చెందిన వస్తువులుగానీ, మొబైల్‌ యాప్‌లు గానీ వాడకూడదని తన విభాగం సిబ్బందికి ఏకంగా ఫర్మానా జారీ చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అమితాబ్‌ యాష్‌ ఉన్నారు. గల్వాన్‌ లోయలో భారత సైనికులు 20 మందిని చైనా సైన్యం పొట్టన పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగా తన ఎస్‌ఐబీ లోని సిబ్బందికి చైనా వస్తువులతోపాటు ఆ దేశ మొబైల్‌ యాప్‌లను వినియోగించడం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

చైనాకు చెందిన మొబైల్‌ యాప్‌లను ఫోన్లో పెట్టుకోవడం ద్వారా వారు మన సమాచారాన్ని తెలుసుకొని మనకు హాని తలపెడుతున్నారని, అందుకని వెంటనే చైనా యాప్‌లను తొలగించాలని సూచించాడు. మీరే కాకుండా మీ కుటుంసభ్యుల ఫోన్లలో కూడా ఈ యాప్‌లు ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. సదరు ఐజీ సూచించిన యాప్‌లలో టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, జూమ్‌, హెల్లో వంటివి దాదాపు 52 ఉన్నాయి. 

గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడిన చైనా 20 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన సమాచారం చైనాకు చేరవేయకుండా ఉండాలన్న సదుద్దేశంతోనే తన సిబ్బందిని చైనా యాప్‌లను తొలగించాలని సూచించానని ఐజీ అమితాబ్‌ యాష్‌ చెప్తున్నారు. 


logo