బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 10:38:30

వికాస్ దూబే ఎపిసోడ్.. సాగింది ఇలా

వికాస్ దూబే ఎపిసోడ్.. సాగింది ఇలా

హైద‌రాబాద్‌:  యూపీ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో అరెస్టు చేశారు.  కాన్పూర్‌లో 8 మంది పోలీసుల‌ను హ‌త‌మార్చిన కేసులో వికాస్ ప్ర‌ధాన నిందితుడు. యూపీ నుంచి ప‌రారైన వికాస్‌.. హ‌ర్యానా, నోయిడాలో త‌ప్పించుకుని తిరిగాడు. అతని కోసం 20 బృందాలుగా పోలీసులు విస్తృతంగా అన్వేష‌ణ చేప‌ట్టారు. అయితే ఇవాళ ఉద‌యం ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. వికాస్ క్రూర‌మైన నేర‌స్తుడు అని, అత‌న్ని ప‌ట్టుకోవ‌డం అంటే పోలీసులు విజ‌యం సాధించిన‌ట్లు చెప్పారు. 

వికాస్ కోసం ఇలా వేట.. 

జూలై 2వ తేదీన వికాస్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు అత‌ని స్వంత ఊరికి వెళ్లారు. ఆ విష‌యం ముందే తెలుసుకున్న ఆ గ్యాంగ్‌స్ట‌ర్.. పోలీసుల‌పై దాడికి ప్ర‌య‌త్నించాడు. ఆ కాల్పుల్లో డీఎస్పీ స‌హా 8 మంది పోలీసులు మృతిచెందారు. 60 కేసుల్లో వికాస్ నిందితుడిగా ఉన్నాడు. 

జూలై 3వ తేదీన ఉద‌యం ఏడు గంట‌ల‌కు వికాస్ దూబే మామ ప్రేమ్ ప్ర‌కాశ్ పాండే, అత‌ని స‌హ‌చ‌రుడు అతుల్ దూబేను ఎన్‌కౌంట‌ర్ చేశారు. పోలీసుల కాల్చివేత కేసులో కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది.

జూలై 5వ తేదీన వికాస్ వ‌ద్ద నౌక‌రీ చేసే ద‌యాశంక‌ర్ అలియాస్ అగ్నిహోత్రిని అరెస్టు చేశారు. పోలీసుల‌ను ఎన్‌కౌంటర్ చేయాల‌ని వికాస్ ముందే ప్లాన్ చేసిన‌ట్లు అత‌ను చెప్పాడు.  

జూలై 6వ తేదీన ఈ కేసుకు సంబంధించి ముగ్గుర్ని అరెస్టు చేశారు.  అమ‌ర్ దూబే త‌ల్లి క్ష‌మా దూబే, ద‌యాశంక‌ర్ భార్య రేఖ కూడా ఇందులో ఉన్నారు. క్ష‌మాదూబే, రేఖ‌లు నేర‌స్తుల‌కు స‌హ‌క‌రించిన‌ట్లు పోలీసులు చెప్పారు.

జూలై 8వ తేదీన స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో అమ‌ర్ దూబే మృతిచెందాడు. వికాస్‌తో లింకున్న ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు.  దాంట్లో ప్ర‌భాత్ మిశ్రా కూడా ఉన్నాడు. 

జూలై 9వ తేదీన జ‌రిగిన ఎక్‌కౌంట‌ర్‌లో ప్ర‌భాత్ మిశ్రాతో పాటు బ‌హువా హ‌త‌మ‌య్యారు.  వికాస్ దూబేను ఉజ్జెయినిలో మ‌హాకాల్ ఆలయానికి వ‌చ్చిన వేళ అరెస్టు చేశారు. ఆల‌య ప‌రిస‌రాల‌కు చేరుకున్న త‌ర్వాత వికాస్ దూబే గ‌ట్టిగా అరుపులు చేసిన‌ట్లు స‌మాచారం.  నేనే వికాస్ దూబేను అంటూ కేక‌లు పెట్టాడు. దీంతో అక్క‌డ ఉన్న సెక్యూర్టీ గార్డులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.  ఆ త‌ర్వాత ఎస్పీకి స‌మాచారం ఇచ్చారు. 

తాజావార్తలు


logo