శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 19:25:43

క‌రోనా ఎఫెక్ట్‌: 80 కిలోమీట‌ర్ల గ‌మ్యం కాలినడకే శరణ్యం

క‌రోనా ఎఫెక్ట్‌: 80 కిలోమీట‌ర్ల గ‌మ్యం కాలినడకే శరణ్యం

ల‌క్నో: ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ మాయ‌దారి వైర‌స్‌కు భ‌య‌ప‌డి అన్ని దేశాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. మ‌న దేశంలోనూ ప్ర‌ధాని మోదీ 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించారు. దీంతో దేశంలో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ప్ర‌జ‌లు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఈ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ ఎవ‌రిపై ఎలా ఉన్నా.. ప‌ట్నాల్లో బ‌తుకుదెరువుకు వ‌చ్చిన నిరుపేద కుటుంబాల‌పై మాత్రం తీవ్రంగా ఉన్న‌ది. ప‌నిలేక‌పోయినా ప‌ట్నాల్లో బ‌తికే స్థోమ‌త‌లేక‌, ప‌ల్లెల‌కు తిరిగే వెళ్లే అవ‌కాశం లేక వారు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోనూ బారాబంకికి చెందిన కొంద‌రు కూలీలు బ‌తుకుదెరువు కోసం వ‌చ్చి చిక్కుకుపోయారు. ఓ స్టీల్ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే వారంతా లాక్‌డౌన్ విధించ‌క ముందు అక్క‌డే ప‌నిచేసి అక్క‌డే ప‌డుకునేవారు. అయితే లాక్‌డౌన్ త‌ర్వాత స్టీల్ ఫ్యాక్ట‌రీ మూత‌ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు వారితో ప‌నిచేయించుకున్న యాజ‌మాన్యం వెళ్లిపొమ్మ‌ని గెంటేసింది. దీంతో నిలువ నీడ లేకుండా అయిన ఆ కూలీలకు సొంతూరికి వెళ్ల‌డం త‌ప్ప మ‌రో మార్గం లేకుండా పోయింది. అందుకే 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బారాబంకికి కాలిన‌డ‌క‌నే వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

అనుకున్న‌దే త‌డ‌వుగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మండుటెండ‌లో త‌మ ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. అడుడ‌గునా పోలీసు ప‌హారా ఉంటుంద‌ని తెలిసినా.. బ్యాగుల్లో తిన‌డానికి కొన్ని బిస్క‌ట్ ప్యాకెట్లు, తాగ‌డానికి మంచినీళ్లు పెట్టుకుని బ‌య‌లుదేరారు. త‌మ ప్ర‌యాణానికి 36 గంట‌లు ప‌డుతుంద‌న్న కూలీలు.. ఎక్క‌డా ఏ అవాంత‌రం లేకుండా న‌డ‌క కొన‌సాగిస్తే గురువారం ఉద‌యానికి త‌మ ఊరికి చేరుకుంటామ‌ని తెలిపారు. 

కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను లెక్క‌చేయ‌కుండా మీరు రోడ్ల‌పైకి రావ‌డం త‌ప్పు క‌దా అంటే.. కంపెనీ నుంచి యాజ‌మాన్యం వెళ్ల‌గొట్టింది, రోడ్ల‌పైన పోలీసులు ఉండ‌నివ్వ‌రు మ‌రి తామెక్క‌డ బ‌తుకాల‌ని అవ‌దేశ్ కుమార్‌ అనే 20 ఏండ్ల కూలీ ఎదురు ప్ర‌శ్నించాడు. లాక్‌డౌన్ కు వ్య‌తిరేకంగా న‌డుచుకోవాల‌న్న‌ది మా ఉద్దేశం కాద‌ని, ఇంత‌కు మించి మ‌రో దారిలేకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అవ‌దేశ్ తెలిపాడు. అవ‌దేశ్ కుమార్ తోపాటు బ‌య‌లుదేరిన గుంపులో కొంద‌రు 50 ఏండ్లు పైబ‌డిన‌వారు కూడా ఉండ‌టం బాధాక‌ర‌మైన విష‌యం.   


  
 logo