బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 08:41:26

స్వీయ నిర్బంధంలోకి ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు

స్వీయ నిర్బంధంలోకి ఆరోగ్య శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ లక్నోలని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన దావత్‌కు హాజరయ్యారు. ఇదే పార్టీకి రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్‌ సింగ్‌, ఎమ్మెల్యేలు పంకజ్‌ సింగ్‌, ధిరేంద్ర సింగ్‌, తేజ్‌పాల్‌ హాజరయ్యారు. అయితే కనికా కపూర్‌కు కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ పార్టీకి హాజరైన ప్రజాప్రతినిధులంతా అప్రమత్తమై స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 

విదేశాల నుంచి వచ్చి దావత్‌లకు.. 

‘బేబీ డాల్‌' సింగర్‌గా పేరున్న కనికాకపూర్‌ (41) ఈ నెల 10న లండన్‌ నుంచి ముంబైకి విమానంలో వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన దావత్‌కు హాజరయ్యారు. ఇదే పార్టీలో రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో కనికాకపూర్‌ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలో కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని, తాను నిర్బంధంలోకి వెళ్తున్నానని ఆమె శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు లక్నోలోని సంజయ్‌ గాంధీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.తన కూతురు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వరుసగా మూడు దావత్‌లకు  హాజరయ్యిందని,  250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనిక తండ్రి రాజీవ్‌ కపూర్‌ తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లో దుష్యంత్‌ 

రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. మరోవైపు యూపీ ప్రభుత్వం లక్నోలోని తాజ్‌మహల్‌ హోటల్‌ను సీజ్‌ చేసింది. ఇక్కడ జరిగిన ఓ దావత్‌లో కనిక పాల్గొన్నట్టు సమాచారం. 


logo