శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:02:13

యూపీలో వలస కార్మికులకు నైపుణ్యాల ఆధారంగా ఉపాధి

యూపీలో వలస కార్మికులకు నైపుణ్యాల ఆధారంగా ఉపాధి

లక్నో : కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన మొత్తం 37.61 లక్షల మంది వలస కార్మికులకు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఉద్యోగాలు లభించాయి. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల్లో పోషకాహార నిపుణులు, ఆర్థిక సలహాదారులు, ఆదాయపన్ను సలహాదారులు, స్పోర్ట్స్ కోచ్లు, జిమ్ ట్రైనర్లు, యోగా టీచర్లు, ట్యూటర్లు సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. జూన్‌ వరకు సేకరించిన సమాచారం ప్రకారం 20.37 లక్షల మందిని నైపుణ్యం కలిగిన వారిగా 15 లక్షల మందిని నైపుణ్యం లేని వారిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. దాదాపు 2 లక్షల మంది ఉపాధి వివరాలు లభ్యం కాలేదని పేర్కొంది.

కార్మికుల నైపుణ్యం ఆధారంగా వారిని 93 కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. ప్రతీ కేటగిరీలో ఓ నిర్ధిష్ట నైపుణ్యం ఉన్న కార్మికులను చేర్చింది. నైపుణ్యాల వారీగా ఉపాధి లెక్కలను ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ తయారు చేసింది. ఈ లెక్కల ప్రకారం మొత్తం కార్మికుల్లో 3.18 లక్షల మంది మహిళలు ఉన్నారు. అన్ని నైపుణ్యాలు కలిగిన కార్మికుల్లో మైనర్లు (15 నుంచి 18 ఏండ్ల వయస్సు) 1.63 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. నిర్మాణరంగ కార్మికులు 10.8 లక్షలు ఉన్నారు. మొత్తం నైపుణ్యం కలిగిన కార్మికుల్లో వీరు 50 శాతం. తరువాత ఫ్యాక్టరీ కార్మికులు 1.25 లక్షల మంది, ఇతర కార్మికులు 1.21 లక్షల మంది, వ్యవసాయ కార్మికులు 83,344 మంది ఉన్నారు. చిత్రకారులు, పీఓపీ కార్మికులు 89,681 మంది, దర్జీలు 66,535 మంది, వడ్రంగులు 65,043 మంది, డ్రైవర్లు 46,471 మంది, నిపుణులైన యోగా టీచర్లు 417, ట్యూటర్లు (2674), కోచ్లు 1,102, ఫోటోగ్రాఫర్లు 504 మంది, ఆర్థిక సలహాదారులు 407 మంది, ఆదాయపు పన్ను సలహాదారులు 129 మంది, డైటీషియన్లు 407 మంది, బార్బర్స్ /బ్యూటీషియన్లు 10,013 మంది, కుక్స్ 23,745 మంది ఉన్నారు. ఈ-కామర్స్ ఉద్యోగులు 18,048 మంది, ఆయాస్/ పిల్లల సంరక్షకులు (7,210) మంది, కాల్ సెంటర్ ఉద్యోగులు (3,481) మంది, బ్యాంకు, బీమా విభాగం సిబ్బంది (2,275), క్లర్క్లు/అకౌంటెంట్స్ (2,516), ఆహార తయారీ సిబ్బంది (4,238), ఐటీ ఉద్యోగులు (1,237), వర్తక విభాగం కార్మికులు 1,346 మంది ఉన్నారు.

మార్చి నుంచి మే వరకు రెండు దశల్లో తూర్పు యూపీ జిల్లాలకు అత్యధికంగా వలస కార్మికులు స్వగ్రామాలకు వచ్చారు. సిద్ధార్థనగర్, ప్రయాగ్ రాజ్, గోండా మహరాజ్ గంజ్, బహ్రైచ్, బలరాంపూర్‌, జౌన్పూర్, హర్దోయ్, ఆజంగఢ్, బస్తీ, గోరఖ్ పూర్ తదితర జిల్లాల్లో వీరి సంఖ్య అత్యధికంగా ఉంది. తిరిగి వచ్చిన వలస కార్మికుల్లో నైపుణ్యాలను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకంతోపాటు నిర్మాణరంగ పనులు సహా వివిధ రంగాల్లోని నివాసులందరినీ శోధించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, కానీ వారిలో చాలామంది వెనక్కి వెళ్లిపోయారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.


logo