మంగళవారం 19 జనవరి 2021
National - Dec 29, 2020 , 23:49:11

ద్వేష రాజకీయాలకు కేంద్రంగా యూపీ

ద్వేష రాజకీయాలకు కేంద్రంగా యూపీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ‘ద్వేషపూరిత రాజకీయాలకు కేంద్రంగా మారిందని 104 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద మత మార్పిళ్ల వ్యతిరేక ఆర్డినెన్స్‌ రాష్ట్రాన్ని ‘ద్వేషపూరిత విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మార్చేసింది’ అని పేర్కొన్నారు. 

ఈ మేరకు వారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. మాజీ జాతీయ సలహాదారు శివశంకర్‌ మీనన్‌, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి నిరుపమారావు, ప్రధానికి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ తదితరులు ఆ లేఖపై సంతకాలు చేశారు. ‘చట్ట విరుద్ధ ఆర్డినెన్స్‌’ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రమాణ చేశారు. కనుక మీరంతా రాజ్యాంగం పట్ల మీ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ముఖ్యమంత్రి సహా రాజకీయ నేతలందరినీ కోరారు.

గంగా జమున నాగరికతకు కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌ ‘ద్వేషపూరిత విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మార్చేసింది. పాలనా వ్యవస్థలను మతపరంగా విషపూరితం చేస్తున్నారు’ అని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘యువతపై మీ అధికార యంత్రాంగం హేయమైన అకృత్యాలకు పాల్పడింది. సాధారణ పౌరులుగా స్వేచ్ఛా జీవనం సాగించాలని భారతీయులు కోరుతున్నారు’ అని ఆ లేఖ వ్యాఖ్యానించింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పలు దఫాలు దాడులు జరిగాయని తెలిపింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.