మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 13:52:05

విద్యుత్‌ మీటర్లకు యూపీ ఓ ‘ప్రయోగశాల’ : ప్రియాంక

విద్యుత్‌ మీటర్లకు యూపీ ఓ ‘ప్రయోగశాల’ : ప్రియాంక

న్యూఢిల్లీ : విద్యుత్‌ మీటర్లకు ఉత్తరప్రదేశ్‌ ఓ ప్రయోగశాలగా మారిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లింగ్‌లో అవకతవకలు జరిగాయని, యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం బాధ్యుతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి సంబంధించి స్లాబ్‌ రేట్లను తగ్గించాలన్నారు. చేనేత కార్మికులు, చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్‌ బిల్లులు తగ్గించి ఉపశమనం కలిగించాలని కోరారు. గత కొన్నేళ్లుగా విద్యుత్‌ రేట్లు భారీగా పెరిగాయని, గత ఎనిమిదేళ్లలో గ్రామీణ గృహ వినియోగదారుల స్లాబ్‌ రేట్లు 500శాతం పెరిగాయని, పట్టణాల్లో 84శాతం, రైతులకు 126 శాతం పెరిగాయన్నారు.

విద్యుత్‌ మీటర్లు వేగంగా తిరుగుతున్నాయని, తాళాలు వేసి ఉన్న ఇండ్లల్లో కూడా ఏడెనిమిది వేల బిల్లు వస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక జిల్లాలో విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయకుండా బిల్లులు కూడా వచ్చాయని విమర్శించారు. ధరల పెరుగుదల, చిరువ్యాపారులు కూదేలయ్యాయని, రైతుల పంటలు అమ్ముకావడం లేదని, వరదలు, వడగళ్లు, ప్రకృతి వైపరీతాలు సంభవించినప్పుడు వారికి సహాయం అందడం లేదన్నారు. మహమ్మారి సమయంలో విద్యుత్‌ రేట్లను పెద్ద ఎత్తున తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే రైతుల బిల్లులు మాఫీ చేయాలని, చేనేత, చేతివృత్తులు, చిన్నతరహా పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు.