శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 20:30:45

అన్‌లాక్‌ 5.0 : తెరుచుకోనున్న థియేటర్లు, మల్టీప్లెక్సులు

అన్‌లాక్‌ 5.0 : తెరుచుకోనున్న థియేటర్లు, మల్టీప్లెక్సులు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను బుధవారం ప్రకటించింది. వీటి ప్రకారం రేపటి నుంచి  సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్‌లు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థలను అక్టోబర్ 15 నుండి తిరిగి తెరుస్తారు.

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను అనుసరించి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్‌ఓపీ) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేయనున్నది. ఈ మార్గదర్శకాలను అనుసరించి వచ్చే నెల 15 వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరిచేందుకు అనుమతించనున్నారు. విద్యార్థులను పాఠశాలలకు రమ్మని అడగడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ విధులు, ఇతర సమ్మేళనాలకు ఇప్పటికే 100 మంది వ్యక్తులకు అనుమతిస్తున్నారు. ఇలాఉండగా, కంటైనేషన్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు అక్టోబర్ 31 వరకు అమలు చేయబడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసి తదుపరి దశను ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. అయితే, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించే విషయాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు పేర్కొన్నది. ఆన్‌లైన్ తరగతులను కూడా సమాంతరంగా అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిషన్ హాల్‌లు, ఎంటర్టైన్మెంట్ పార్కులను తిరిగి తెరవడానికి అనుమతిస్తామని, అయితే సంఖ్యలపై పరిమితి ఉందని ప్రభుత్వం తెలిపింది.


logo