శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 29, 2020 , 20:09:02

అన్‌లాక్‌ 3: ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు మూత

అన్‌లాక్‌ 3: ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు మూత

హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్రం అన్‌లాక్ 3 మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు ఆగస్టు 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. బుధవారం సాయంత్రం కేంద్రం  ఈ మేరకు అన్‌లాక్ 3 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుకానున్నాయి.

సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్‌లు.. ఇలాంటి ప్రదేశాలను తెరిచి ఉంచడానికి అనుమతించబోమని మార్గదర్శకాలలో పేర్కొన్నది. అయితే, యోగా ఇన్స్టిట్యూట్స్, వ్యాయామశాలలు ఆగస్టు 5 నుంచి పనిచేయడానికి అనుమతించారు. దీని కోసం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) త్వరలో జారీ చేయనున్నారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ప్రకారం అంతర్జాతీయ విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుంది. మెట్రో రైలు సేవలు, సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, పెద్ద సమ్మేళనాల కార్యకలాపాలు కూడా అనుమతించబడవు. పై కార్యకలాపాలను పున: ప్రారంభించే తేదీలు విడిగా రూపొందించనున్నారు. వీటికి కూడా అవసరమైన ఎస్ వోపీలు జారీ చేస్తారని మార్గదర్శకాల్లో వెల్లడించారు. 

స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు, ఎట్ హోమ్ ఫంక్షన్లను భౌతిక దూర నిబంధనలను అనుసరించి నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తోంది. లాక్డౌన్ నిబంధనలు ఆగస్టు 31 వరకు కంటైనర్ జోన్లలో అమలులో ఉంటాయి.

వీటికి అనుమతి..

* రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేశారు.

* జిమ్ లు, యోగా కేంద్రాలు ఆగస్ట్ 5 నుంచి తెరుచుకోవచ్చు.

* భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు.


వీటికి అనుమతి లేదు..

*  కంటైన్మెంట్ జోన్లలో ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది.

* స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంబంధ సంస్థలు ఆగస్టు 31 వరకు తెరువకూడదు.

* మెట్రో రైళ్లు నడపడంపై నిషేధం కొనసాగుతుంది.

* బార్లు ఎప్పటిమాదిరిగానే మూసివుంచాలి.


logo