బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:14:20

పేదరికంపై భారత్‌ విజయం

పేదరికంపై భారత్‌ విజయం

  • 10 ఏండ్లలో 27.3 కోట్ల మందికి విముక్తి
  • ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి
  • 2005 నుంచి 2015 మధ్యలో అధ్యయనం
  • వర్ధమాన దేశాల్లో ఇంకా 130 కోట్ల మంది పేదరికంలోనే మగ్గుతున్నారు

యూఎన్‌: 2005 నుంచి పదేండ్ల వ్యవధిలో ఇండియాలో 27.3 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఈ పదేండ్ల కాలానికి సంబంధించి 75 దేశాల్లో అధ్యయనం నిర్వహించగా 65 దేశాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ), ‘ఆక్స్‌ఫర్డ్‌ పేదరికం, మానవాభివృద్ధి కార్యక్రమం’(ఓపీహెచ్‌ఐ) సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఆరోగ్యం, విద్య, ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు కొరవడటం తదితరాలను పేదరికానికి కొలమానాలుగా తీసుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. భారత్‌, ఆర్మేనియా, నికరాగ్వా, ఉత్తర మాసిడోనియా దేశాలు 5-10 ఏండ్ల కాలవ్యవధిలోనే పేదరికాన్ని తగ్గించుకున్నాయని నివేదిక పేర్కొన్నది. భారత్‌లో ఇంత తక్కువ కాలవ్యవధిలో ఇన్ని కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులు కావడం రికార్డు అని పేర్కొన్నది. ప్రపంచంలో ఐదో వంతు పేదలు ఈ నాలుగు దేశాల్లోనే ఉన్నట్టు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న 107 దేశాల్లో 130 కోట్ల మంది ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పేదరికం ప్రభావం చిన్నపిల్లలపై ఎక్కువగా ఉన్నదని, ఈ 130 కోట్ల మందిలో సగం మందికి ఇంకా 18 ఏండ్ల వయసు కూడా నిండలేదని పేర్కొన్నది. దాదాపు 60శాతం మంది పిల్లలకు టీకాలు కూడా వేయడం లేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పేదల్లో 84 శాతం మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది.


logo