సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:00:30

వెరీ స్పెషల్ థీమ్.. బంగారానికి బదులు కూరగాయలు

వెరీ స్పెషల్ థీమ్.. బంగారానికి బదులు కూరగాయలు

బెంగళూరు : వివాహ వేడుకలకు మహిళలతోనే ప్రత్యేక ఆకర్శణ. ఖరీదైన, ప్రత్యేక ఆభరణాలు ధరించి పెండ్లి మంటపంలో అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ ముచ్చట్లు పెడుతూ ఉండే ఆ కళే వేరు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంగారం కొనేందుకు మగువలు ఎక్కువగా ఆసక్తి చూపడంలేదు. పైపెచ్చు బంగారం ధరలు ఆకాశాన్ని దాటి వెళ్లిపోవడంతో బంగారాన్ని అందుకోలేక పాపం మహిళలు ఉసూరుమంటున్నారు. 

కానీ, బెంగళూరులో కొందరు మహిళలు బంగారం ధర పెరిగిందని ఇంట్లో కూర్చోలేదు. ముడి కూరగాయలతో ఆభరణాలు తయారుచేయించుకొని ధరించి ఒక వివాహానికి హాజరైన తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆనందంలో పచ్చదనాన్ని చేర్చడం ఇదే కాబోలు. కూరగాయలను ఆభరణాలుగా ధరించిన మహిళల ఫొటోలు ఇంటర్నెట్ , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కూరగాయల చెవిపోగులు, దండలు, కంకణాలు, గాజులు, గజ్రా అన్నీ ఇతివృత్తానికి తోడ్పడుతున్నాయి. ఆకుపచ్చ ఆభరణాలు బంగారు, మెరిసే ఆభరణాల కన్నా తీసిపారేసేటివి కావని నిరూపించారు. ఈ ఆభరణాల్లో వీరు మరింత అందంగా కనిపిస్తుండటం విశేషం. ఈ ఇతివృత్తాన్ని బెంగళూరుకు చెందిన మరాఠీ సంస్థ 'అపుల్కి' తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కానందున.. ముడి కూరగాయలతో ఆభరణాలు తయారుచేయించి మహిళలతో ధరింపజేసి పెండ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దీంతో కూరగాయల వినియోగం కేవలం వంటల తయారీకి మాత్రమే పరిమితం కాదని, వాటిని కూడా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చని కూడా స్పష్టంచేసింది. 

ఈ ముడి కూరగాయల ఆభరణాలను ఈ విధంగా ధరించడం వెనుక ఒక సందేశం ఉన్నదని.. బంగారం మార్కెట్లో రూ.50 వేల ధరకు చేరుకోవడంతో ఈ ప్రయోగాత్మక ప్రదర్శనను ఉదాహరణగా సమర్పించామని అపుల్కి సంస్థ నిర్వాహకులు చెప్పారు. 


logo