శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:57:55

భారత కంపెనీలు, శాస్త్రవేత్తలను ప్రశంసించిన కేంద్రమంత్రి

భారత కంపెనీలు, శాస్త్రవేత్తలను ప్రశంసించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించారు. ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌) టెక్నాలజీస్ ఫర్ కొవిడ్ -19 మిటిగేషన్’ కంపెడియంను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై పోరులో అలుపెరుగని చేస్తున్నారంటూ వైద్యులను అభినందించారు. దేశం ప్రస్తుతం ఐదు లక్షల కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తోందని, వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనేది ప్రణాళిక అన్నారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 64శాతానికిపైగా ఉందన్నారు. దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న గుర్తించారని, అప్పటి నుంచి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటం ఇంకా కొనసాగుతుందన్నారు. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన గురించి, ఆరు నెలల క్రితం భారతదేశం వెంటిలేటర్లను దిగుమతి చేసుకుంటుందని, ఇప్పుడు మూడు లక్షల వెంటిలేటర్లను తయారు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దేశంలో చాలా వరకు వెంటిలెటర్లను తయారు చేస్తున్నారని, దేశం దాదాపు 150 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ ఔషధాన్ని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌లో ప్రతి రోజు ఆరువేల పరీక్షలు చేశామని, ఈ రోజు ప్రతి రోజు ఐదులక్షలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఒకటి, రెండు నెలల్లో ప్రతి రోజు పది లక్షల పరీక్షలకు చేయాలనేది మా ప్రణాళిక, దీనికి కోసం కృషి చేస్తున్నామని వివరించారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ దేశాల్లో ప్రయత్నాలు జరుగుతుండగా, దేశం వెనుకబడి లేదన్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ ఇప్పటికే హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభించగా‌, పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo