మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 13:57:41

కేంద్ర మంత్రికి పోలీసుల నోటీసు

కేంద్ర మంత్రికి పోలీసుల నోటీసు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు నోటీసు జారీ చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన ప్రయత్నించినట్లు ఆరోపణలున్న ఆడియో టేపుల గురించి వివరణ కోరారు. అలాగే గజేంద్ర సింగ్ షెఖావత్ గొంతు నమూనాలను కోరారు. ఈ మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఒక నోటీసును రాజస్థాన్ ఎస్‌వోజీ పోలీసులు పంపినట్లు  గజేంద్ర సింగ్ షెఖావత్ సోమవారం తెలిపారు.

రాజస్థాన్‌కు చెందిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డబ్బుల విషయం గురించి మాట్లాడుతున్న ఆడియో టేప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి వీటి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గజేంద్ర సింగ్‌తో పాటు ఆయనతో మాట్లాడినట్లు ఆరోపణులన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  సర్దర్‌షహర్, భన్వర్ లాల్ శర్మతోపాటు సంజయ్ జైన్ అనే వ్యక్తిపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు కేసు నమోదు చేశారు.

జైన్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు ఆడియో టేపుల వ్యవహారంపై ఆయనను ప్రశ్నించారు. కాగా, ఆ టేపులో ఉన్న సంభాషణలు తమవి కావని, అవి నకిలీవని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో పాటు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి వారి గొంతు నమూనాలు సేకరించేందుకు రాజస్థాన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ టీమ్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు.logo