మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 06, 2020 , 15:40:52

జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర ‌మంత్రి

జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించాం : కేంద్ర ‌మంత్రి

న్యూఢిల్లీ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పై పూర్తిగా చ‌ర్చించామ‌ని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర  సింగ్‌ షెకావ‌త్ తెలిపారు. రెండు రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల‌పై కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి షెకావ‌త్ నేతృత్వంలో జ‌రిగిన అపెక్స్ కౌన్సిల్ స‌మావేశానికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ముఖ్య‌మంత్రులు కేసీఆర్, జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. రెండు గంట‌ల పాటు కొన‌సాగిన ఈ స‌మావేశంలో.. కృష్ణా, గోదావ‌రి ప‌రిధిలోని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం కేంద్ర మంత్రి షెకావ‌త్ మీడియాతో మాట్లాడారు. 

2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అపెక్స్ కౌన్సిల్ ఏర్ప‌డింది. చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా న‌దీ జ‌లాల బోర్డు ఏర్పాటైంద‌ని తెలిపారు. ఇవాళ ప్ర‌ధానంగా నాలుగు అంశాల‌పై చ‌ర్చించామ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో ఇద్ద‌రు సీఎంలు త‌మ‌త‌మ వాద‌న‌లు వినిపించారు. రెండు రాష్ర్టాలులేవ‌నెత్తిన అంశాల‌పై చ‌ర్చించామ‌న్నారు. కృష్ణా, గోదావ‌రి ప్రాజెక్టుల‌పై కొత్త నిర్మాణాల‌కు అనుమ‌తి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు ఉంది. కొత్త ప్రాజెక్టుల‌కు డీపీఆర్‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని ఇరు రాష్ర్టాల సీఎంల‌ను కోరామ‌ని తెలిపారు. డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ర్టాల సీఎంలు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని పేర్కొన్నారు.  కృష్ణా ట్రిబ్యున‌ల్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది. ట్రిబ్యున‌ల్ ద్వారా నీటి కేటాయింపులు జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ ప‌రిష్కారానికి  వ‌చ్చామ‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామ‌న్నారు.  పోతిరెడ్డిపాడు, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు అని తెలిపారు. 2016లో మొద‌టి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రెండోసారి కౌన్సిల్ భేటీ అయింది. ఏడాదికి ఒక‌సారైనా అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించాలి.  ఆరేళ్లు గ‌డిచినా గోదావ‌రి బోర్డు ప‌రిధి నిర్ణ‌యం కాలేదు. నాగార్జున సాగ‌ర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై చ‌ట్ట ప్ర‌కార‌మే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు.