బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 11:06:41

సా. 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం

సా. 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం

న్యూఢిల్లీ : ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్‌ వెల్లడించనున్నారు. రూ. 20 లక్షల కోట్లతో నిన్న ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించిన విషయం విదితమే. 

కరోనాపై పోరులో కునారిల్లిన భారత ఆర్థికవ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కార్పొరేట్‌రంగం నుంచి రైతన్నల వరకు, చిన్న పరిశ్రమల నుంచి వలస కూలీవరకు ప్రతి ఒక్కరూ తిరిగి పుంజుకొనేందుకు అవసరమైన శక్తిని ఈ ప్యాకేజీ ఇస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం రాత్రి టీవీలో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని, దేశ స్వయం ప్రకాశమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుందని పేర్కొన్నారు. దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ 10శాతమని వివరించారు. ప్యాకేజీ పూర్తివివరాలను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం నుంచి దశలవారీగా ప్రకటిస్తారని తెలిపారు. 


logo