గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 20:54:02

ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నరు : వసుంధర రాజే

ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నరు : వసుంధర రాజే

జైపూర్ :  రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలిసారిగా పెదవి విప్పారు. కాంగ్రెస్‌లో నెలకొన్న గొడవలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని శనివారం ట్విట్టర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విషయాలతో గొడవలు తలెత్తాయని, మధ్యలోకి బీజేపీని లాగడం సరికాదన్నారు.  రాజస్థాన్‌ ప్రజలే ముఖ్యం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు మాజీ ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు జీవితాలను కోల్పోతున్నారని, మిడతల దండు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అలాగే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, కరెంటు సమస్య పెరిగిందని.. ఇలా ప్రజలు పడుతున్న కొన్ని సమస్యలను మాత్రమే చెప్పగలుగుతున్నానని చెప్పారు. ఈ దిశలో కాంగ్రెస్‌ ఇలా చేయడం దురృష్టకరమన్నారు.

వాళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంలో బీజేపీని లాగి, పార్టీ నేతలపై బురద జల్లడం సరికాదని ట్వీట్‌ చేశారు. కొంతకాలంగా రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించగా, తమకే సంబంధం లేదని బీజేపీ చెబుతున్నది. ఇప్పటికే హార్స్‌ ట్రేడింగ్‌ ఆడియో టేపుల్లో స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ రెండు  కేసులు నమోదు చేయగా సంజయ్‌ జైన్‌ను అరెస్టు చేసింది.  అలాగే ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఫిర్యాదు మేరకు ఏసీబీ సైతం ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది. సీఎం అశోక్ గెహ్లాట్‌కు సహకరించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఇటీవల బీజేపీ మిత్రపక్షం లోక్‌తాంత్రిక్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి రాజే పావులు కదుపుతున్నట్టు ఆర్ఎల్పీ ఎంపీ హనుమాన్ బేనీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె ఎట్టకేలకు స్పందించడంతో విమర్శలకు చెక్‌ పెట్టినట్లయింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo