మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 16:27:51

ర‌హ‌దారుల‌పై వేగ ప‌రిమితుల‌ను స‌మీక్షించాలి : నితిన్ గ‌డ్క‌రీ

ర‌హ‌దారుల‌పై వేగ ప‌రిమితుల‌ను స‌మీక్షించాలి : నితిన్ గ‌డ్క‌రీ

ఢిల్లీ : ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్ర‌జా ర‌వాణా, స‌రుకు ర‌వాణా వాహ‌నాల వేగంతో పోల్చితే మ‌న దేశంలో వాహ‌నాల స‌గ‌టు వేగం చాలా త‌క్కువ‌. 2019లో ఓ నివేదిక ప్ర‌కారం.. హైదరాబాద్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 26 నిమిషాల స‌మ‌యం పడుతుంది. ఇదే దూరానికి అదే చెన్నై, ఢిల్లీలో 29 నిమిషాలు, బెంగళూరులో 34 నిమిషాలు, ముంబైలో 37, కోల్‌కతాలో 39 నిమిషాల స‌మ‌యం పడుతుంది. అందుకు ర‌హ‌దారుల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌ సైతం కార‌ణంగా ఉండొచ్చు. కానీ కాల‌క్ర‌మంలో మౌలిక స‌దుపాయాల పెంపుతో జాతీయ‌, రాష్ర్ట ర‌హ‌దారుల రూపురేఖ‌లు మారుతున్నాయి. 

డ‌బుల్‌, నాలుగు లేన్లు, ఆరు లేన్ల ర‌హ‌దారులుగా రూపుదిద్దుకుంటున్నాయి. అయినా ఇప్ప‌టికీ ఆ పాత రోడ్ స్టేఫ్టీ నిబంధ‌న‌లే కొన‌సాగుతూ అభివృద్ధి ప‌రుగుల‌కు బ్రేకులు వేస్తున్నాయి. దేశంలోని చాలా న‌గ‌రాల్లోని రహదారులపై వాహనాల వేగ పరిమితి సుమారు 50 కి.మీ. మాత్ర‌మే. ఢిల్లీ, ఆగ్రాలను కలిపే యమునా ఎక్స్‌ప్రెస్ వేపై మాత్ర‌మే 100 కిలోమీటర్ల వేగ పరిమితి ఉంది. అదేవిధంగా ఢిల్లీ చుట్టూ నిర్మించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే, హై-స్పీడ్ బైపాస్ కారిడార్‌లో వేగ పరిమితి 120 కి.మీగా ఉంది. 

ఇటీవ‌ల 40 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితిని దాటినందుకు ప‌లు వాహ‌న య‌జ‌మానుల‌కు అధికారులు జ‌రిమానాలు విధించారు. ఈ అంశం గ‌త‌వారం కేంద్ర ర‌వాణాశాఖ మంత్రి నిర్వ‌హించిన వే టు విజ‌న్ జీరో వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. మ‌ల్టీ లేన్ల ర‌హ‌దారుల‌పై గంట‌కు 40 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితిని దాటినందుకు జ‌రిమానాలు విధించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. బ‌హుళ లేన్ల ర‌హ‌దారుల‌పై వేగ ప‌రిమితిని పెంచాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే అధికారుల‌తో కూడా చ‌ర్చించినట్లు చెప్పారు. 

ఎక్స్‌ప్రెస్ ‌వేలు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, హైవేలను నాలుగు, ఆరు లేన్‌లకు వెడల్పు చేయడం వంటి కొత్త రహదారులను పరిగణనలోకి తీసుకొని వేగ ప్రమాణాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశంలో అధిక ప్రమాదాల‌కు రోడ్ ఇంజనీరింగ్, రోడ్ డిజైన్ కూడా ఒక కార‌ణ‌మ‌ని ఆయ‌న అంగీక‌రించారు. తన మంత్రిత్వశాఖ ఇప్ప‌టికే ఇలాంటి వాటిని గుర్తించి దాదాపుగా వెయ్యి చోట్ల స‌రిచేసిన‌ట్లు చెప్పారు. రాష్ట్ర రహదారులను అభివృద్ధికి, నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సహాయం చేస్తుందని గడ్కరీ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.