గురువారం 04 జూన్ 2020
National - May 18, 2020 , 00:34:17

దారి తెలియని గమ్యం.. కరువైన సాయం!

దారి తెలియని గమ్యం.. కరువైన సాయం!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఉపాధి లేక, బతుకు భారమై వలస కూలీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సొంతూరికెళ్లేందుకు కుమారుడు (4), కుమార్తె (7)తో కలిసి ఆ వలస కూలీ దంపతులు సుమారు 30 కిమీ దూరం కాలినడకన ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇందుకు వారికి రెండ్రోజులు పట్టింది. అటుపై 4 రోజుల తర్వాత గానీ వారి స్టేషన్‌లో అడుగుపెట్టలేకపోయారు. గేటు నుంచే పోలీసులు తమను తరిమారని వలస కూలీ జితేందర్‌ సాహ్నీ తెలిపారు. ‘జనరల్‌ రైళ్లు నడవడం లేదని, ఏసీ రైల్‌ టికెట్లు తీసుకోవాలని వారు మాకు చెప్పారు. కానీ మా వద్ద రూ.5000 లేవు. రైల్లో కింద కూర్చొని వెళ్లేందుకైనా అనుమతించాలని బతిమాలినా పట్టించుకోలేదు’ అని వాపోయారు. దీంతో వారు చేసేదేంలేక 4 రోజులుగా ఫుట్‌ఫాత్‌పైనే ఉంటున్నారు. ఈ నెల 18 నుంచి జనరల్‌ రైళ్లు నడుస్తాయని పోలీసులు చెప్పారని, అప్పటికీ రైలు దొరక్కుంటే కాలినడకన సొంతూరుకు వెళ్తామన్నారు. ఢిల్లీ నుంచి వారి స్వస్థలం సమస్తిపూర్‌కు 1100 కిమీ. శ్రామిక్‌ రైళ్లను ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తరలించిన విషయాన్ని ఆ వలస కూలీలకు తెలియజెప్పే నాథుడే లేరు. దీనిపై ఉత్తరరైల్వే అధికారి మాట్లాడుతూ తాము పేపర్లు, టీవీలు, సోషల్‌మీడియాలో పదేపదే చెప్పామని బదులిచ్చారు. శ్రామిక్‌ రైళ్ల వ్యవహారం రాష్ర్టాలదన్నారు. రైల్వే స్టేషన్‌ ఎదుట మాత్రం సాహ్నీ వంటి పలువురు కూలీలు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. 


logo