మంగళవారం 26 జనవరి 2021
National - Dec 18, 2020 , 21:03:21

113 రోజులు కరోనాతో పోరాడి కోలుకున్న వృద్ధుడు

113 రోజులు కరోనాతో పోరాడి కోలుకున్న వృద్ధుడు

అహ్మదాబాద్‌: ఒక వృద్ధుడు కరోనాతో సుమారు నాలుగు నెలలపాటు పోరాడారు. చివరకు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గుజరాత్‌కు చెందిన 59 ఏండ్ల రవీంద్ర పర్మార్‌కు ఆగస్టు 26న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తొలుత అహ్మదాబాద్ ధోల్కాలోని ఒక ప్రైవేట్‌ దవాఖానకు అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆగస్టు 28న ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే  సోలా దవాఖానకు తరలించారు. సుమారు మూడు నెలలపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఊపిరి తిత్తులు బాగా దెబ్బతినడంతో ఒక్కోసారి నిమిషానికి 75 లీటర్ల ప్రాణవాయువును అందించారు. ఆ తర్వాత రవీంద్ర ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. దీంతో 113 రోజుల చికిత్స అనంతరం శుక్రవారం ఆయనను దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు. రాష్ట్రంతోపాటు దేశంలోనే కరోనాకు సుదీర్ఘంగా చికిత్స పొందిన వ్యక్తి బహుశా ఈ వృద్ధుడేనని తెలిపారు. మరికొంత కాలం ఆయనకు ప్రాణవాయువు అవసరమవుతుందని చెప్పారు. ఒకవేళ ఆయన ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొంది ఉండే సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయ్యేదని అన్నారు. సుమారు నాలుగు నెలల వరకు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందడంతో వైద్యం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని వివరించారు. 

కరోనాతో పోరాడుతున్న వారికి రవీంద్ర స్ఫూర్తిగా నిలుస్తారని దవాఖాన సూపరింటెండెంట్ పినా సోని తెలిపారు. ఆయన కోలుకోవడం వైద్య సిబ్బందిలో ధైర్యాన్ని పెంచిందన్నారు. తన భర్త ప్రాణాలు కాపాడిన వైద్య నిఫుణులు, సిబ్బందికి రవీంద్ర భార్య ధన్యవాదాలు తెలిపారు. కాగా కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భరత్‌సింహ్ సోలంకి 102 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo