గురువారం 16 జూలై 2020
National - Jun 25, 2020 , 17:50:34

లైంగిక దాడి తర్వాత అతనితో కలిసి ఎలా నిద్రించావు?

లైంగిక దాడి తర్వాత అతనితో కలిసి ఎలా నిద్రించావు?

బెంగళూరు: లైంగిక దాడి తర్వాత ఏ భారతీయ మహిళ కూడా నిందితుడితో కలిసి రాత్రంతా నిద్రించదంటూ కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి అరెస్ట్‌ కాకుండా ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తన వద్ద పని చేస్తున్న ఓ ఉద్యోగిని 27 ఏండ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. ఓ రోజు రాత్రి ఆమె కారులో ఎక్కి కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మందు సేవించారు. అనంతరం శారీరకంగా కలుసుకున్నారు. ఆ రాత్రంతా ఇద్దరు అక్కడే కలిసి నిద్రించారు. అయితే ఆ వ్యక్తి తనపై లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరోవైపు పోలీసులు తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ కోసం అతడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ ఎస్ దీక్షిత్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. లైంగిక దాడి జరిగిందన్న ఆ మహిళ ఆరోపణలపై ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల వేళ పని చేసే కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఏమున్నది. ఆ వ్యక్తితో కలిసి మందు సేవించినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. లైంగిక దాడిని ఎందుకు ప్రతిఘటించలేదు. అనంతరం రాత్రంతా అతడితో కలిసి అక్కడే ఎలా నిద్రించగలిగావు. ఫిర్యాదు చేయడాలని ఎందుకు ఆలస్యమైంది... అంటూ పలు ప్రశ్నలు సంధించారు. లైంగిక దాడికి గురైన ఏ భారతీయ మహిళ కూడా ఇలా ప్రవర్తించదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆ వ్యక్తికి రూ.లక్ష పూచికత్తుపై ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే అనుమతి లేకుండా నగరం వీడిచి వెళ్లరాదని, ప్రతి నెల రెండు, నాలుగు శనివారాల్లో పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్ట్‌ చేయాలని అతడిని ఆదేశించారు. 

logo