సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 03:13:49

పాక్‌ శాంతిని కోరుకుంటున్నది

పాక్‌ శాంతిని కోరుకుంటున్నది
  • కర్తార్‌పూర్‌ కారిడార్‌ దీనికి నిదర్శనం
  • గురుద్వారాను సందర్శించిన ఐరాస అధినేత గుటెరస్‌

లాహోర్‌, ఫిబ్రవరి 18: పాకిస్థాన్‌ శాంతిని కోరుకుంటున్నదని, కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణమే దీనికి నిదర్శనమని ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ తెలిపారు. సిక్కుమత వ్యవస్థాపకుడైన గురు నానక్‌ దేవ్‌ తుదిశ్వాస విడిచిన కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పాకిస్థాన్‌ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ, వలసవాద ఆస్తుల ట్రస్ట్‌ బోర్డు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పాక్‌, భారత్‌ సరిహద్దుల మధ్య నిర్మించిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాముఖ్యతను గుటెరస్‌కు వివరించారు. 


గురుద్వారా సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిని, మత సామరస్యాన్ని పాక్‌ ఆక్షాంక్షిస్తున్నదని, కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. భారత్‌తోపాటు, ఇతర దేశాల్లోని సిక్కు యాత్రికుల కోసం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీసుకున్న చొరవను గుటెరస్‌ ప్రశంసించారు. సిక్కు యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ను, భారత్‌లోని గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌ను కలుపుతూ పాక్‌, భారత్‌ సంయుక్తంగా నిర్మించిన కర్తార్‌పూర్‌ కారిడార్‌ను గత ఏడాది నవంబర్‌లో ఇరు దేశాల ప్రధానులైన ఇమ్రాన్‌ ఖాన్‌, మోదీ తమతమ భూభాగాల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.


logo