శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 21:29:38

ఆత్మనిర్భర్ భారత్ సాధనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి

 ఆత్మనిర్భర్ భారత్ సాధనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి

ఢిల్లీ : ఆత్మనిర్భర్ భారత్ సాధనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.  శుక్రవారం ఆవిష్కరణలు, వ్యవస్థాపకత పెంచే వర్చువల్ కార్యక్రమం 'ఉద్యమి ఉత్సవ్‌'లో పాల్గొని ప్రసంగించారు. యువ పారిశ్రామికవేత్తల్లో ఆవిష్కరణ ఆలోచనలు పెంచడం, వాటిని స్టార్టప్‌లుగా ఆచరణలోకి తేవడం ద్వారా వారిని శక్తిమంతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్" ఆత్మనిర్భర్‌ భారత్‌ "గురించి ప్రధాన్‌ తన ప్రసంగంలో వివరించారు. కొవిడ్-19 సవాళ్లను అవకాశాలుగా మార్చడంలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర, స్వావలంబన, వసుదైక కుటుంబ స్ఫూర్తిని నిజం చేయడం వంటి అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. చుట్టూ ఉన్న సామాజిక, ఆర్థిక సవాళ్లను గుర్తించి వాటిని అవకాశాలుగా మార్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం.., ఆవిష్కరణల వృద్ధి, స్వావలంబనకల్పించడం తోపాటు ప్రగతి పథంలోకి దేశాన్ని నడిపించాలన్నారు. సంపద సృష్టితో పాటు సమాజానికి మంచి చేసే వ్యవస్థాపకత నిజమైన ఉద్దేశాన్ని అర్ధం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. ప్రపంచానికి ఆర్థిక ప్రయోజనం కల్పించే, అందరికీ అందుబాటులో ఉండే, స్థిరమైన, లాభదాయక నమూనాను రూపొందించడానికి వివిధ లక్ష్యాల మధ్య సమతుల్యం సాధించాలని పిలుపునిచ్చారు.ఆర్ధిక వ్యవస్థను  బలోపేతం చేయడంతోపాటు , దేశీయ పారిశ్రామికవేత్తలకు అన్ని స్థాయిల్లో చేయూతనివ్వడం లో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాన్ తెలిపారు.


logo