సోమవారం 25 జనవరి 2021
National - Sep 10, 2020 , 19:36:17

కశ్మీర్‌లో పెరుగుతున్న డ్రగ్స్ దందా

కశ్మీర్‌లో పెరుగుతున్న డ్రగ్స్ దందా

శ్రీనగర్ : కశ్మీర్‌ కూడా 'ఉడ్తా పంజాబ్' మాదిరిగా తయారవుతుందా? లోయలో డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదా? హెరాయిన్ కోసం అక్కడి వారు లక్షల్లో ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏటికాయేడు డ్రగ్స్ తీసుకుంటున్న వారు పెరుగుతున్నా నార్కోటిక్స్ స్సెషల్ స్క్వాడ్ ఏం చేస్తుందో అర్థంగాకుండా ఉన్నది. గతంలో నల్లమందు, హషీష్ వంటి డ్రగ్స్ తీసుకోగా.. ప్రస్తుతం హెరాయిన్ సేవించడం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

గత నెల 27 వ తేదీన దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఓ 30 ఏండ్ల పరిశోధకుడు తన ఆరోగ్యం బాగోలేదని కుటుంబసభ్యులకు చెప్పారు. మందులు తీసుకుంటునప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దవాఖానకు తరలిస్తుండగా దారి మధ్యలోనే మరణించాడు. తొలుత ఈ యువకుడు చనిపోవడానికి గుండెపోటు కారణమన్న స్థానికులు.. దర్యాప్తు తర్వాత మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్లనే చనిపోయాడని తేలింది. అతడు అప్పుడప్పుడు మత్తు తీసుకునేవాడని, అయితే ఇటీవల చరస్ నుంచి హెరాయిన్ కు అలవాటు పడినప్పటి నుంచి ఆరోగ్యం చెడిపోయిందని తెలిసింది. 

మాదకద్రవ్య వ్యసనం కశ్మీర్‌లో ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం తరపున లేదా మాదకద్రవ్య వ్యసనంపై పనిచేసే వారి వద్ద డేటా లేదు. ప్రసిద్ధ మానసిక వైద్యుడు, ముష్తాక్ మార్కుబ్, అతడి సహోద్యోగి కేఎస్ దత్తా తాము ప్రచురించిన పుస్తకాల్లో కశ్మీర్లో 2.11 లక్షల మంది ప్రజలు వివిధ రకాలుగా మత్తులో జోగుతున్నారని పేర్కొన్నారు. 2014 లో ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాల నియంత్రణ కార్యక్రమం (యూఎన్‌డీపీ) నిర్వహించిన ఒక సర్వేలో కశ్మీర్‌లో మాదకద్రవ్యాల బానిసల సంఖ్య 70 వేలు అని, వారిలో 4,000 మంది మహిళలు అని తేలింది. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (ఎన్డీడీటీసీ) నిర్వహించిన సర్వే ఆధారంగా 2019 లో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క మరొక నివేదిక ప్రకారం.. జమ్ముకశ్మీర్ జనాభాలో 4.9 శాతం మంది మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారని వెల్లడించింది. అంటే జమ్ముకశ్మీర్‌లో మొత్తం 6 లక్షల మంది మత్తులో ఉన్నారన్నమాట.

మరో బాధాకరమైన విషయం ఏంటంటే పూర్వపు ప్రజలు హషీష్, నల్లమందు, జనపనార, ఫుక్కి, బూట్ పాలిష్ మత్తులో ఉండేవారు. ఇప్పుడు దవాఖానలో చేరిన వారు ఎక్కువగా హెరాయిన్ బానిసలుగా తేలుతున్నారు. రెండేండ్ల క్రితం, 10 మందిలో ఇద్దరు హెరాయిన్ వాడేవారని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ ముజఫ్ఫర్ ఖాన్ చెప్పారు. అయితే, ఇప్పుడు 10 మందిలో 8, 9 మంది హెరాయిన్ కు బానిసలుగా మారిన పరిస్థితి ఉంది. 2016-17లో మాదకద్రవ్యాలకు బానిసలైనవారు 490 మంది ఉండగా.. వారంతా 10 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గలవారని, వీరిలో 80 నుంచి 90 శాతం మంది హెరాయిన్‌కు బానిసలని వైద్యులు అంటున్నారు.

2016 నుంచి కశ్మీర్ లో హెరాయిన్ దిగుమతి కావడం ప్రారంభించిందని దక్షిణ కశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పోలీసుల డీ అడిక్షన్ సెంటర్‌లో పనిచేస్తున్న క్లినికల్ సైకాలజిస్ట్ ముదాసిర్ అజీజ్ చెప్పారు. రెండేండ్ల క్రితం ఎయిమ్స్ కోసం అజీజ్ నిర్వహించిన సర్వేలో నలుగురి నుంచి 1600 మంది హెరాయిన్ బానిసలను గుర్తించారు. ఈ హెరాయిన్ అంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా రవాణా అవుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. అంత దూరం నుంచి కశ్మీర్‌కు ఎలా చేరుకుంటుందో ఇప్పటివరకు ఎవరి వద్దా సమాధానం లేదు.


logo