బుధవారం 28 అక్టోబర్ 2020
National - Oct 15, 2020 , 22:13:43

బాలీవుడ్‌ను నాశనం చేసే కుట్రలు సహించబోం: ఉద్ధవ్‌ ఠాక్రే

బాలీవుడ్‌ను నాశనం చేసే కుట్రలు సహించబోం: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై: హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ను నాశనం చేసే, అపఖ్యాతి కలిగించే లేదా మరో చోటకి మార్చే ప్రయత్నాలు, కుట్రలను సహించబోమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో మూసివేసిన సినిమా థియేటర్లను పునరుద్ధరించే నేపథ్యంలో మల్టీప్లెక్స్‌, సినిమా థియేటర్ల యజమానులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బాలీవుడ్‌ను నాశనం చేసే, లేదా మరోచోటికి తరలించే కుట్రలను సహించబోమని అన్నారు. ముంబై దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానే గాక వినోద రాజధాని కూడా అని చెప్పారు. ‘బాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. హిందీ చిత్ర పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. గత కొన్ని రోజులుగా అపఖ్యాతి కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమ ఇమేజ్‌ దెబ్బతీసేలా కొన్ని వర్గాలు వ్యవహరించడం బాధ కలిగిస్తున్నది’ అని ఆయన ఉద్ధవ్‌ అన్నారు.

సుశాంత్‌ మరణం నేపథ్యంలో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై మీడియా కథనాలు, ఎన్సీబీ దర్యాప్తు, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా ఫిల్మ్‌ సిటీ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా సినిమా థియేటర్ల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఉద్ధవ్‌ తెలిపారు. అయితే సంబంధిత కరోనా మార్గదర్శకాలను ఖరారు చేసిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని మల్టీప్లెక్స్‌, సినిమా థియేటర్ల యజమానులకు ఆయన చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo