సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 02:11:16

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

  • అమెరికా ఎన్నికలు గందరగోళం
  • ఒక్కో రాష్ర్టానిది ఒక్కో నిబంధననెలల పాటు ఓటింగ్‌ ప్రక్రియ
  • లెక్కింపునకు వారాల సమయం

న్యూఢిల్లీ: ఆధునిక ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన దేశం. హక్కుల విషయంలో ప్రపంచానికే మార్గదర్శి. కానీ ఏం లాభం. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల విషయంలో అమెరికాలో ఉన్నంత గందరగోళం మరే దేశంలోనూ లేదు. భారతదేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం కల్లా దాదాపు అన్ని స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. అదే అగ్రరాజ్యం అమెరికాలో ఈ నెల 3వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేవలం 16 కోట్ల మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ మూడు రోజులైనా సాగుతూనే ఉన్నది. ‘గ్రేట్‌' అమెరికా అని పదే పదే చెప్పుకునే ఆ దేశం.. ఎన్నికల విషయంలో ఇతర దేశాలను, ముఖ్యంగా భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

అమెరికా ఎన్నికల విధానం 

1.దేశవ్యాప్త ఎన్నికలను నిర్వహించడానికి అమెరికాకు కేంద్ర ఎన్నికల సంఘం లేదు. అధ్యక్ష ఎన్నికలను కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ సంస్థలే నిర్వహిస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఎన్నికలను నిర్వహిస్తాయన్న మాట. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ అభ్యర్థికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, నిబంధనలను రూపొందించడం లాంటి అక్రమాలు జరగొచ్చు.

2.దేశవ్యాప్త ఓటరు లిస్టు ప్రజలకు అందుబాటులో ఉండదు. ప్రజలే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాష్ర్టాలు ఓటరు జాబితాను తయారు చేస్తాయి. ఓటరు నమోదులో వేర్వేరు రాష్ర్టాలకు వేర్వేరు నిబంధనలు ఉంటాయి. కొన్ని రాష్ర్టాల్లోనైతే పోలింగ్‌ రోజు కూడా ఓటరు రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఉంటుంది.  

3.అమెరికాలో ‘పోలింగ్‌ రోజు’ (ఎలక్షన్‌ డే) అనేది నామమాత్రమే. అంతకుముందే అనేక మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్‌ డే తర్వాత కూడా ఓట్లు వేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే పోలింగ్‌ డే అంటే కౌంటింగ్‌ ప్రారంభించే రోజు అనవచ్చు. 

4.పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో కూడా ఒక్కో రాష్ర్టానిది ఒక్కో నిబంధన. ప్రజలకు ముందుగానే బ్యాలెట్‌ పేపర్లను అందజేస్తారు. వీటిని కొంతమంది దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నది. 

భారతీయ ఎన్నికల విధానం

భారత్‌లో జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పరిధిలో ఉంటుంది. ఒక్కసారి ఎన్నికల షెడ్యూలు వెలువడితే ప్రభుత్వం అధికారాలు పరిమితం అవుతాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఎన్నికల సంఘమే ఓటరు జాబితాను ప్రచురిస్తుంది. దీనిలో ప్రభుత్వాల జోక్యం కుదరదు. ఇండియాలో పోలింగ్‌ డే రోజు సెలవు దినం. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవడానికి కొందరు ఉద్యోగులు, వృద్ధులు తదితరులకు అనుమతి ఉంది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకరీతి నిబంధనలు అమల్లో ఉంటాయి.