గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 12:07:12

టైఫూన్ వామ్‌కోతో త‌ల్ల‌డిల్లుతున్న ఫిలిప్పీన్స్‌.. 67కు పెరిగిన మృతుల సంఖ్య‌

టైఫూన్ వామ్‌కోతో త‌ల్ల‌డిల్లుతున్న ఫిలిప్పీన్స్‌.. 67కు పెరిగిన మృతుల సంఖ్య‌

మ‌నీలా: ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా ఫిలిప్పీన్స్ విప‌త్తుల‌తో అతలాకుతలం అవుతున్న‌ది. ఇటీవ‌లే గోనీ తుఫాన్‌తో త‌ల్ల‌డిల్లిన ఫిలిప్పీన్స్‌ను ఇప్పుడు టైఫూన్‌ వామ్‌కో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. టైఫూన్‌ వామ్‌కో ధాటికి మృతుల సంఖ్య ఇప్ప‌టివ‌ర‌కు 67కు పెరిగింది. వామ్‌కో ధాటికి వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో 12 మంది గ‌ల్లంత‌య్యారు. ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా రాజధాని మనీలా చుట్టుపక్కల గ్రామాలు బురదమయంగా మారాయి. 

వామ్‌కో తుపాన్ బీభత్సానికి మ‌నీలాలోని ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ధ్వంసమైన ఇళ్ల శిథిలాలతో కొన్ని గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పలు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా దేశంలోని చాలా ప్రాంతాల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం నేల‌పైన, నీటిపైన వినియోగించ‌గ‌ల ఉభయచర వాహనాలను వినియోగిస్తున్నారు. బులాక్యాన్, పాంపాంగ్‌ రాష్ట్రాలపై టైఫూన్ వామ్‌కో భాగా ప్రభావం చూపింది. 

ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు నాలుగు ల‌క్ష‌ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారంద‌రికీ వేర్వేరు ప్రాంతాల్లో పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి ఆశ్ర‌యం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. సాధార‌ణంగా భారీ విపత్తులు సంభవించే దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటిగా ఉన్న‌ది. ప్ర‌తి ఏడాది దాదాపు 20 తుపాన్ల వర‌కు ఫిలిప్పీన్స్‌ను తాకుతాయి. అయితే, ఈసారి ఆ సంఖ్య దాటిపోయింద‌ని, టైఫూన్ వామ్‌కో ఈ ఏడాది మ‌నీలాను తాకిన 21వ తుఫాన్ అని అధికారులు తెలిపారు. తుపాన్‌లే కాదు మ‌నీలాలో త‌ర‌చూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు కూడా సంభవిస్తాయ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.