శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 03:02:46

కబలిస్తున్న కొవిడ్‌

కబలిస్తున్న కొవిడ్‌
  • డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కరోనా
  • చైనాలో 1,665కు చేరిన మృతులు..
  • ఐటీబీపీ క్యాంప్‌లోని 406 మందికి నెగెటివ్‌
  • నేటినుంచి ఇండ్లకు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బీభత్సం కొనసాగుతున్నది. జపాన్‌లోని యోకోహామా తీరంలో నిర్బంధించిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని ప్రయాణికుల్లో కొత్తగా 137 మందికి ఈ వైరస్‌ సోకినట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. దీంతో ఓడలో వైరస్‌ సోకిన ప్రయాణికుల సంఖ్య 355కు చేరింది. ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నారు. కరోనా వైరస్‌బారినపడి ఇప్పటివరకూ 1,665 మంది చనిపోగా, 68,500 మందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, కరోనా వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరం నుంచి తీసుకొచ్చిన భారతీయుల్లో ఆ వైరస్‌ లక్షణాలు కనిపించలేదని, దీంతో వాళ్లను స్వస్థలాలకు పంపించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ సోమవారం ఆరంభంకానున్నట్టు వెల్లడించారు.


 గతనెలలో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి దిగిన హాంకాంగ్‌ ప్రయాణికుడికి కరోనా వైరస్‌ సోకిందన్న కారణంతో జపాన్‌ రాజధాని టోక్యో సమీపంలోని యోకోహామా తీరంలో ఫిబ్రవరి 5న ఆ నౌకను అధికారులు నిర్బంధించి ఓడలోని 3,711 మందికి దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓడలోని 355 మందికి ఈ వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, ఓడలో ఉన్న 138 మంది భారతీయుల్లో (132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు) ఐదుగురిలో (ముగ్గురు సిబ్బంది, ఇద్దరు ప్రయాణికులు) ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ‘ఇప్పటివరకూ ఓడలోని 1,219 మందికి పరీక్షలు నిర్వహించాం, 355 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలింది’ అని అధికారులు చెప్పారు. 


తీసుకెళ్లిపోతాం

డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటంచేత ఓడలోని ప్రయాణికులందరికీ కరోనా పరీక్షలు, వైద్య సేవలు అందించే స్థితిలో అధికారులు లేరు. ఈ క్రమంలో నౌకలో చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకుపోతామని అమెరికా, కెనడా, హాంకాంగ్‌లు ప్రకటించాయి. ఓడలో నిర్బంధించిన తమ 330 మంది పౌరులను స్వదేశానికి తీసుకుపోవడానికి చార్టర్‌ విమానాల్ని ఉపయోగిస్తామని హాంకాంగ్‌ ప్రకటించింది. ఓడలోని పౌరులకు కరోనాకు సంబంధించి తుది పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని, కరోనా లేదని తేలిన వారిని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జపాన్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. వైరస్‌ సోకిన ఐదుగురు భారతీయులకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. 


నేటి నుంచే విడుదల

కొవిడ్‌-19 వెలుగుచూసిన వుహాన్‌ నుంచి తీసుకొచ్చిన 406 మంది భారతీయులు ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ)ల నిర్భంధంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జరిపిన పరీక్షల్లో వీరికి కరోనా లక్షణాలు లేవని తేలింది. దీంతో వారిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఐటీబీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి ఈ ప్రక్రియ దశలవారీగా మొదలుకానున్నట్టు ఆయన వెల్లడించారు. మరోవైపు, ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో చైనాకు అన్ని విధాలుగా సహకరిస్తామని భారత్‌ పునరుద్ఘాటించింది. త్వరలో వ్యాధి నియంత్రణకు కావలసిన వైద్య సామగ్రిని చైనాకు పంపబోతున్నట్టు చైనాలోని భారత రాయబారి విక్రమ్‌ మిస్రి పేర్కొన్నారు. 


ఈ బంధం శాశ్వతం

కరోనా కల్లోలంతో చైనా అల్లాడుతున్నది. ఈ క్రమంలో ఓ వృద్ధ దంపతుల తాజా వీడియో నెటిజన్ల మనసుల్ని కదిలిస్తున్నది. కరోనా వైరస్‌ సోకిన తన భార్యకు 87 ఏండ్ల  వృద్ధుడు తనే స్వయంగా ఆహారం పెడుతూ.. సపర్యలు చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. కరోనా సోకిన పేషెంట్ల దగ్గరకు బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని డాక్టర్లు వెళ్లనివ్వడంలేదు. అయితే, ఇన్నాళ్లూ తనతో కలిసి జీవించిన తన భార్యను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదల్లేనని.. తనకు వైరస్‌ సోకినా పర్వాలేదంటూ.. డాక్టర్లు ఎంత చెప్పినా వినకుండా ఆయన తన భార్యకు సపర్యలు చేశాడు. దీంతో ఆ పెద్దాయనకు కూడా వైరస్‌ సోకింది.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల హృదయాల్ని గెలుచుకుంటున్నది. ఈ వీడియో చూసిన చాలామంది జాలి పడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఆ దంపతులు ఇద్దరూ త్వరగా వ్యాధి నుంచి కోలుకొని హాయిగా జీవించాలని కోరుకుంటున్నారు.


logo