శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 11:46:42

చాపకింద నీరులా కరోనా

చాపకింద నీరులా కరోనా
  • మరో ఇద్దరు భారతీయులకు వైరస్
  • ప్రపంచ వ్యాప్తంగా మూడువేలు దాటిన మృతుల సంఖ్య
  • ఢిల్లీలో ఒకరికి, తెలంగాణలో మరొకరికి
  • జైపూర్‌లో ఒక విదేశీయుడికి కూడా

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా(కొవిడ్‌-19) భారత్‌ను కూడా వదలట్లేదు. తాజాగా ఇద్దరు భారతీయులకు ఈ వైరస్‌ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే, మన దేశ పర్యటనకు వచ్చిన ఒక విదేశీయుడికి కూడా కరోనా సోకినట్టు గుర్తించామని రాజస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదైనట్టు అయింది. అయితే, గతంలో ఈ వైరస్‌ సోకిన కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం కోలుకొని, దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యుల పర్యవేక్షణలో 25,738 మంది ఉన్నారని వీరిలో 37 మందిలో వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామన్నారు. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో అవసరముంటే తప్ప ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాలకు ప్రయాణించొద్దని కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సూచించారు. కరోనాను గుర్తించడం, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తతతో ఉన్నట్టు పేర్కొన్నారు.

దుబాయ్‌ టు హైదరాబాద్‌..

కరోనాకు ప్రభావితమైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, మరొకరు తెలంగాణకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇటీవల ఇటలీకి వెళ్లి వచ్చినట్టు, తెలంగాణ వ్యక్తి దుబాయి నుంచి వచ్చినట్టు హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. శ్వాసలో ఇబ్బంది, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో ఆ ఇద్దరూ వైద్యుల్ని సంప్రదించారని, ఈ విధంగా వాళ్లలో కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడయ్యిందని తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నదన్నారు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాన్‌, ఇటలీలో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. భారత పర్యటనకు వచ్చే ఇరాన్‌, చైనా దేశస్థులకు వీసాల జారీని నిలిపివేసినట్టు, వైరస్‌ తీవ్రతను బట్టి అవసరమైతే మరికొన్ని దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశమున్నట్టు హర్షవర్ధన్‌ చెప్పారు. ఇటీవల ఇరాన్‌ నుంచి దాదాపు 1,086 మంది దేశానికి వచ్చారని, వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు, ఇటలీకి చెందిన ఓ పర్యాటకుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. 

ఐదున్నర లక్షల మందికి పరీక్షలు

నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, చైనా, హాంకాంగ్‌, థాయిలాండ్‌, దక్షిణకొరియా, సింగపూర్‌, జపాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఇప్పటివరకూ 5,57,431 మందికి విమానాశ్రయాల్లో, మరో 12,431 మందికి నౌకాశ్రయాల్లో పరీక్షలు జరిపామన్నారు. అలాగే ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ర్టాలకు చెందిన 10,24,992 మందికి వైరస్‌ పరీక్షలు జరిపినట్టు, 25,738 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. కరోనా అనుమానంతో 37 మంది నమూనాలను పరీక్షలకు పంపామన్నారు.


కరోనాతో ఇరాన్‌ కీలక నేత మృత్యువాత 

ఇరాన్‌ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ సలహామండలిలో సభ్యుడైన మహ్మద్‌ మిర్మొహమ్మది(71) కరోనాతో సోమవారం మృతిచెందారు. ఇరాన్‌ ఉపాధ్యక్షురాలు మౌసోమెహ్‌ ఎబ్టెకర్‌, టాస్క్‌ఫోర్స్‌ అధినేత ఇరాజ్‌ హరిచ్చి కూడా కరోన బారినపడ్డారు. ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,501 మందికి కరోనో వైరస్‌ సోకగా, 66 మంది మరణించారు. మరోవైపు, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య సోమవారం మూడు వేలు దాటింది. దీంట్లో  2,912 మంది చైనాకు చెందినవారే.
logo