గురువారం 02 జూలై 2020
National - Jun 16, 2020 , 13:32:56

ఛత్తీస్‌గఢ్‌లో మరో రెండు ఏనుగులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరో రెండు ఏనుగులు మృతి

రాయపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి. అంతకుక్రితమే రాష్ట్రంలో మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఓ ఏనుగు ప్రెగ్నెంట్‌. వారం వ్యవధిలోనే ఇవన్ని అనుమానాస్పదరీతిలో మృతిచెందాయి. ధంతారి జిల్లాలోని మోగ్రి గ్రామంలోని బ్యాక్‌వాటర్‌ సమీపంలోని చిత్తడి నేలలో మృతిచెందిపడి ఉన్న ఏనుగు పిల్లను నేడు గుర్తించారు. ధంతారి డివిజన్‌ అటవీ అధికారి అమితాబ్‌ బాజ్‌పాయ్‌ స్పందిస్తూ... మృతిచెందిన ఏనుగు పిల్ల వయస్సు మూడున్నరేళ్ళుగా తెలిపారు. నీళ్లు త్రాగేందుకు బ్యాక్‌ వాటర్‌ ప్రదేశానికి వెళ్లి అక్కడి బురద నేలలో చిక్కుకుని చనిపోయి ఉండొచ్చన్నారు.

ఏనుగు పిల్ల చనిపోయిన విధానాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజులక్రితమే ఏనుగు పిల్ల బురదలో చిక్కుకుని ఉండొచ్చన్నారు. ఎవరూ చూడని కారణంగా సహాయం చేసేందుకు వీలుపడలేదన్నారు. ఆకలి దప్పులు, గాయాల కారణంగా ఏనుగు చనిపోయి ఉండొచ్చన్నారు. 21 ఏనుగుల సమూహంతో ఉండే ఈ ఏనుగు పిల్ల తప్పిపోయి ఇలా మృత్యువాతపడిందన్నారు. మరొక ఘటనలో రాయగఢ్‌ జిల్లా ధరంజైగఢ్‌లో మరో ఏనుగు మృతిచెందింది. జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతిచెందింది. ఏనుగు మృతి ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.


logo