సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 02:41:43

అమిత్‌షాకు కరంట్‌ షాక్‌ ఇచ్చారు

అమిత్‌షాకు కరంట్‌ షాక్‌ ఇచ్చారు
  • ఓఖ్లా అభ్యర్థి అమానతుల్లా ఖాన్‌
  • 70వేల మెజారిటీతో విజయం

న్యూఢిల్లీ: ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కరంట్‌ షాక్‌ ఇచ్చారని ఆ స్థానం నుంచి గెలుపొందిన ఆప్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ పేర్కొన్నారు. తన సమీప ప్రత్యర్థి బ్రహంసింగ్‌పై(బీజేపీ) ఆయన 71,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఆప్‌ నేతల్లో అమానతుల్లాఖాన్‌ ఒకరు. ‘ఓఖ్లా’ అసెంబ్లీ స్థానం పరిధిలోనే షాహీన్‌బాగ్‌, దాని సమీపంలోనే జామియా వర్సిటీ ఉన్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా జామియా నగర్‌ వాసులు, షాహీన్‌బాగ్‌ వాసులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రస్తుతం షాహీన్‌బాగ్‌లో నెలకొన్న పరిస్థితికి వ్యతిరేకంగా కరెంట్‌ షాక్‌ వచ్చేలా ఈవీఎం బటన్‌ నొక్కి తమ ఆగ్రహాన్ని వెల్లడించాలని స్థానికులను కోరారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అమానతుల్లాఖాన్‌ స్పందిస్తూ ‘ఓఖ్లా ప్రజలు అమిత్‌షాకు కరంట్‌ షాకిచ్చారు’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించడంతో షాహీన్‌బాగ్‌ ప్రాంత వాసులు సంబురాల్లో మునిగి తేలారు. 


logo