శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 14, 2021 , 01:53:10

సరిహద్దుల్లో భారీ సొరంగం

సరిహద్దుల్లో భారీ సొరంగం

  •  భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు కోసం..  

జమ్ము: వీలుచిక్కినప్పుడల్లా ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ పన్నిన మరో కుట్ర బట్టబయలైంది. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) గుండా జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని హీరానగర్‌ సెక్టార్‌లో ఆ దేశం నిర్మించిన ఓ భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) బుధవారం గుర్తించింది. ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారా పాక్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులు సులభంగా ప్రవేశించవచ్చని చెప్పారు. తాజాగా బయటపడిన సొరంగానికి మరో పక్కన (పాకిస్థాన్‌ భూభాగంలో) షకేర్‌ఘర్‌ ప్రాంతం ఉన్నదని బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (జమ్ము) ఎన్‌ఎస్‌ జమ్వాల్‌  తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలకు, ఉగ్రవాదుల శిబిరాలకు ఆ ప్రాంతం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రెండు నుంచి మూడు అడుగుల వ్యాసంతో, 25 నుంచి 30 మీటర్ల లోతున 150 మీటర్ల పొడువుతో ఉన్న ఈ సొరంగంలో కొన్ని ఇసుక సంచులను గుర్తించామని, వాటిపై పాకిస్థాన్‌ గుర్తులు ఉన్నాయని వివరించారు. ఈ సంచుల్లో కొన్ని 2016-17లో తయారయ్యాయని, కాబట్టి ఈ సొరంగం కొత్తగా నిర్మించింది కాదని వెల్లడించారు. 


logo