గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 01:29:04

విపక్షాల విమర్శలు సిగ్గుచేటు

విపక్షాల విమర్శలు సిగ్గుచేటు

  • కాంగ్రెస్‌, టీడీపీ ఎన్నడూ రైతులను పట్టించుకోలేదు
  • ‘నమస్తే తెలంగాణ’తో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో అధికారం వెలగబెట్టి రైతులకు ఏమాత్రం మేలుచేయని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలను దేశంలో ఎక్కడాలేనివిధంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే అవగాహనలేకుండా బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానమేమిటి?

సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీలు రైతు గురించి ఏనాడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల పేరుతో ముందస్తు అడ్వాన్స్‌లు పంచుకుతిన్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో  తెలంగాణను సస్యశ్యామలంగా మార్చారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా పంటల కొనుగోళ్లు చేపట్టారా? 

వానకాలం రైతుబంధు ఎప్పట్నుంచి అమలవుతుంది? 

వచ్చే వానకాలం రైతుబంధు అమలుచేసేందుకు ఆర్థికశాఖ ఇప్పటికే రూ.7 వేల కోట్లు మంజూరుచేసింది. మే చివరి వారం నుంచి జూన్‌ 30 వరకు రైతుల ఖాతాలో జమచేస్తాం. గత జనవరి 31 నాటికి వ్యవసాయశాఖ వద్ద రైతుబంధు పోర్టల్‌లో వివరాలు నమోదైన రైతులందరికీ రైతుబంధు వర్తింపచేస్తాం.

యాసంగి పంట కొనుగోళ్లు ఎలా ఉన్నాయి?

రాష్ట్రంలో యాసంగిలో రికార్డుస్థాయిలో పంట లు పండినయి. చివర్లో కొన్నిచోట్ల వడగండ్లతో కొద్దిగా నష్టం జరుగడం బాధాకరం. 39.46 లక్షల ఎకరాల్లో వరిసాగుకాగా.. 80 శాతం కోతలు పూర్తయ్యాయి. 50శాతం మేర కొనుగోళ్లు జరిగాయి. 

వచ్చే వానకాలం సాగు ప్రణాళిక ఎలా ఉంటుంది?

గత వానకాలంతో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరో 10 లక్షల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశమున్నది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను సిద్ధంచేశాం. 21 లక్షల టన్నుల ఎరువులు, 5 లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్‌గా ఉంచాం. 

పంటల మార్పిడి చర్యలేమిటి? 

పంట మార్పిడిపై రైతుబంధు సమితులు, వ్యవసాయశాఖ విస్తృతంగా అవగాహన కల్పించనున్నాయి. ప్రభుత్వం ప్రకటించినవిధంగానే పంటల సాగుచేపట్టాలి.అన్ని జిల్లాల్లో భూసారాన్ని పెంచేందుకు రైతులకు సబ్సిడీపై జీలుగ, పిల్లిపెసర,జనుములాంటి పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తాం.

పండ్లతోటల ప్రోత్సాహక ప్రణాళికలు ఏమిటి?

రాష్ట్రంలో ఆహారంలో సమతుల్యతను పెంచేందుకు ఉద్యానపంటలను ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం పండ్లతోటల్లో సూక్ష్మసేద్యాన్ని అమలు చేస్తున్నాం. తెలంగాణలో కొత్త పండ్ల సాగును ప్రోత్సహిస్తున్నాం.


logo