శనివారం 16 జనవరి 2021
National - Jan 09, 2021 , 14:40:52

ట్రంప్ ట్విట్ట‌ర్ బ్యాన్‌.. ప్ర‌జాస్వామ్య దేశాల‌కు ఇదో హెచ్చ‌రిక‌

ట్రంప్ ట్విట్ట‌ర్ బ్యాన్‌..  ప్ర‌జాస్వామ్య దేశాల‌కు ఇదో హెచ్చ‌రిక‌

బెంగుళూరు :  రెచ్చ‌గొట్టేవిధంగా ట్వీట్లు చేసిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్ ఆయ‌న ఖాతాను శాశ్వ‌తంగా మూసి వేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్య‌క్షుడు తేజ‌స్వి సూర్య స్పందించారు.  ట్రంప్ అకౌంట్‌ను బ్యాన్ చేయ‌డం అంటే.. అది ప్ర‌జాస్వామ్య దేశాల‌కు ఓ హెచ్చ‌రిక వంటిద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.  అమెరికా అధ్యక్షుడి అకౌంట్‌నే బ్యాన్ చేసిన‌ప్పుడు.. మ‌న‌లాంటి వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని ఆయ‌న అన్నారు. బ‌డా టెక్నాల‌జీ కంపెనీలు ప్ర‌భుత్వ‌ నియంత్ర‌ణ‌లో లేకుంటే ఇలాగే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.  ఇవాళ ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయిన తేజ‌స్వి సూర్య‌..  టెక్నాల‌జీ కంపెనీ చ‌ట్టాల‌ను స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇండియాపై అలాంటి నిర్ణ‌యాలు తీసుకోకుండా ఉండేందుకు ఈ స‌మీక్ష అవ‌స‌రం అన్నారు.  

కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి చెందిన వ్య‌క్తుల ట్విట్ట‌ర్ ఖాతాల‌ను బ్యాన్ చేయ‌వ‌ద్దు అని, ఇదే తాను విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు ఓ ట్వీట్‌లో ఎంపీ సూర్య అభిప్రాయ‌ప‌డ్డారు. ఎటువంటి జ‌వాబుదారీత‌నం లేకుండా నా అకౌంట్‌ను సీజ్ చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తాను అని ఎంపీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.  అయితే భార‌త్‌లో ఎమ‌ర్జెన్సీ విధించిన ఓ పార్టీ నుంచి ఇటువంటి అభిప్రాయాలు వెలుబ‌డ‌వు అని ఆయ‌న అన్నారు.  గ‌తంలో తాను పార్ల‌మెంట్‌లో మాట్లాడిన‌ప్పుడు.. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టాలను ర‌ద్దు చేయాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు మ‌రో ట్వీట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారాయ‌న‌. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో జోక్యం చేసుకునే అవ‌కాశం టెక్నాల‌జీ కంపెనీల‌కు ఇవ్వ‌కూడ‌ద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.