ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 08:18:08

వ‌ర్క్ వీసాదారుల‌కు ట్రంప్ షాక్‌!

వ‌ర్క్ వీసాదారుల‌కు ట్రంప్ షాక్‌!

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. స్వ‌దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డం కోసం విదేశీయులు కొత్త‌గా అమెరికాకు వెళ్ల‌కుండా అడ్డుక‌ట్ట వేశారు. ఈ మేర‌కు హెచ్‌1-బీ స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం విధించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక ఆదేశాలు జారీచేశారు. ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది. 

కాగా, వ‌ర్క్ వీసాల‌పై నిషేధం జూన్ 24 నుంచి అమల్లోకి వ‌స్తుంద‌ని, 2020 డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. నాన్-ఇమ్మిగ్రాంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, అమెరికా పౌర‌స‌త్వం ఉన్న‌వారి భార్యలు, పిల్లలకు ఈ ఆదేశాలు వర్తించవని పేర్కొంది. అదేవిధంగా ఆహార స‌ర‌ఫ‌రా రంగంలో ఉన్న వారికి కూడా ఈ నిషేధం వ‌ర్తంచ‌ద‌ని తెలిపింది. విదేశీ వర్కర్ల వల్ల అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుండ‌టంతో తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది. 

అమెరికాలో వ‌చ్చే డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అమెరికన్లకు మద్దతుగా చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని ట్రంప్ భావిస్తున్నారు. విదేశీయుల‌ను కట్టడి చేసి స్థానికుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డంవ‌ల్ల ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌స్తుంద‌ని ఆయన అంచ‌నా వేస్తున్నారు. అయితే, అమెరికాలో ప్రస్తుతం ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 


logo